ప్రధానమంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏకమవుతున్న ప్రతిపక్షాలు బెంగళూరులో సోమ, మంగళవారాల్లో విస్తృతంగా చర్చలు జరుపుతున్నాయి. భావ సారూప్యతగల 26 ఎన్డీయేయేతర పార్టీలు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నాయి. అటువంటి సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.మల్లికార్జున ఖర్గే మంగళవారం ప్రతిపక్ష పార్టీల సమావేశంలో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదని చెప్పారు. భారత దేశ ఆత్మ, రాజ్యాంగం, లౌకికవాదం, సాంఘిక న్యాయం, ప్రజాస్వామ్యాలను పరిరక్షించడంపై మాత్రమే తమ పార్టీకి మక్కువ ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో తమ మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. అవి అధిగమించలేనంత పెద్ద విభేదాలు కావని, ప్రజలను కాపాడటం కోసం వాటిని పక్కన పెట్టవచ్చునని చెప్పారు. ప్రజలు ద్రవ్యోల్బణంతో బాధపడుతున్నారన్నారు. నిరుద్యోగంతో బాధ పడుతున్న యువత కోసం, హక్కుల అణచివేతకు గురవుతున్న పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీల కోసం వాటిని వదిలిపెట్టవచ్చునని చెప్పారు.

ఈ సమావేశానికి హాజరైన 26 పార్టీలకు తగినంత రాజకీయ బలం ఉందని చెప్పారు. 11 రాష్ట్రాల్లో ఈ పార్టీలు అధికారంలో ఉన్నాయన్నారు. కూటముల ప్రాధాన్యాన్ని వివరించారు. బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో 303 స్థానాలను దక్కించుకుందని, ఈ స్థానాలను ఆ పార్టీ తనంతట తాను గెలుచుకోలేదని అన్నారు. బీజేపీ తన మిత్ర పక్షాల ఓట్లను పొంది, అధికారంలోకి వచ్చి, ఆ తర్వాత ఆ మిత్ర పక్షాలను వదిలేసిందని చెప్పారు. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నేతలు రాష్ట్రాల్లో తిరుగుతూ, పాత మిత్రులతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారన్నారు.

ఇదిలావుండగా, ప్రతిపక్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. బెంగళూరులో సమావేశమైన పార్టీలకు ఒకే ఒక మంత్రం ఉందని, అది.. కుటుంబం యొక్క, కుటుంబం ద్వారా, కుటుంబం కోసం అని వివరించారు. అందుకే ప్రజలు 2024లో మళ్లీ ఎన్డీయేను అధికారంలోకి తేవాలని నిర్ణయించుకున్నారన్నారు.

Leave A Reply

Your email address will not be published.