పాపం ఈ పిచ్చి తల్లి

.. కొడుకు జీవితం బాగుండాలని బస్సు కిందపడి చనిపోయింది

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయింది. ఈ 75 ఏళ్లలో మన దేశం అన్ని విధాలుగా అభివ‌ృద్ధి చెందిందని నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ ఏం లాభం? 75 ఏళ్ల మన స్వతంత్ర భారతంలో చదువుకోవడానికి ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి. ఉచిత విద్య అందిస్తున్నామని ప్రభుత్వాలు ఎంత గొప్పగా చెప్పుకుంటున్న నాణ్యమైన విద్య కోసం కార్పొరేట్ విద్యా సంస్థలకు నోట్ల కట్టలు కుమ్మరించక తప్పడం లేదు. మధ్య తరగతి ప్రజలు తమ పిల్లలను చదివించుకోవడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే తన పిల్లలను చదివించుకోవడానికి ఓ తల్లి తీసుకున్న నిర్ణయం గుండె తరుక్కుపోయేలా చేసింది. ఇన్నాళ్లు మనం తల్లి ప్రేమను చాటి చెప్పే ఎన్నో ఘటనలు చూశాం. కానీ ఈ తల్లి ప్రేమ వాటన్నింటిని మించిపోయింది. కన్న కొడుకు చదువు కోసంబంగారు భవిష్యత్ కోసం ఈ తల్లి ఏకంగా తన ప్రాణాన్నే పణంగా పెట్టింది. కొడుకుకు నాణ్యమైన విద్యను అందేలా చూసేందుకు ఓ తల్లి ప్రాణం తీసుకునే దుస్థితి రావడం మన దేశానికే సిగ్గు చేటుగా నిలిచింది.వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని సేలంలో రెండవ అగ్రహారం వీధిలో పాపాతి అనే మహిళ నివసిస్తుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయిఒక అబ్బాయి. 18 సంవత్సరాల క్రితమే భర్తతో విడిపోయిన పాపాతి అప్పటి నుంచి పిల్లలను తానే పెంచి పెద్ద చేసింది. 46 ఏళ్ల పాపాతి స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తుంది. ఆమెకు నెలకు రూ.10 వేలు జీతం అందుతుంది. ఆ జీతంతోనే కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలను చదివించుకుంటుంది. ప్రస్తుతం కూతురు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతుండగా.. కొడుకు ఓ ప్రైవేట్ కళాశాలలో డిప్లొమా చదువుతున్నాడు.ఇలా హాయిగా గడిచిపోతున్న వారి జీవితంలో ప్రైవేట్ కళాశాల ఫీజుల రూపంలో పెను ప్రమాదం ముంచుకొచ్చింది. కొడుకు కళాశాల ఫీజ్ కట్టడానికి రూ.45 వేలు అవసరమయ్యాయి. రూ.10 వేల జీతంతోనే ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న పాపాతికి ఒకే సారి 45 వేల రూపాయలు తీసుకురావడం తలకు మించిన భారంగా మారిపోయింది. కళాశాల ఫీజు కట్టకుంటే కొడుకు చదువు ఆగిపోయే ప్రమాదం ఉండడంతో తనలో తానే తీవ్ర ఆవేదనకు గురైంది. తాను పడిన కష్టాలు తన పిల్లలు పడడానికి వీళ్లేదనిఎట్టి పరిస్థితుల్లో చదువు మధ్యలో ఆగకూడదని భావించింది. ఎలాగైనా కళాశాల ఫీజు కట్టాలనే ఉద్దేశంతో తెలిసిన వారందరినీ అప్పు అడిగింది. కానీ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీనికి తోడు ఇప్పటికే ఉన్న అప్పులు పెరిగిపోవడంతన కుమార్తె వివాహం చేసే భారం కూడా ఉండడంతో పాపాతి తనలో తానే కుమిలిపోయింది. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తూ చనిపోతే ప్రభుత్వం రూ.45 వేలు నష్టపరిహారం చెల్లిస్తుందని ఆమెకు ఎవరో చెప్పారు.దీంతో పాపాతి ఒక ఉపాయం ఆలోచించింది. ‘‘నేను బస్సు కింద పడిపోయి చనిపోతే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. దాంతో నా కొడుకు కళాశాల ఫీజు కట్టి చదువుకుంటాడు. నా ప్రాణం పోయినా పర్వాలేదు. కానీ నా పిల్లల చదువు ఆగకూడదు’’ అని నిర్ణయించుకుంది. దీంతో జూన్ 18న బస్సు కింద పడి చనిపోయింది. పాపాతి బస్సు కింద పడిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డులైంది. ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం సదరు మహిళ రోడ్డుకు ఒక వైపుగా నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలోనే ఒక బస్సు వేగంగా అటుగా వచ్చింది. వెంటనే ఆ బస్సుకు అడ్డుగా ఆమె వెళ్లింది. దీంతో బస్సు వేగంగా ఢీకొట్టింది. ఆ ఘటనతో బస్సు డ్రైవర్ కూడా బస్సునే అక్కడే ఆపేశాడు. బస్సు కింద పడిన మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పాపాతి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిజానికి అంతకుముందే రెండు మూడు సార్లు పాపాతి వేరే వాహనాల కింద పడడానికి ప్రయత్నించింది. కానీ స్వల్ప గాయాలతో బయటపడింది.ప్రమాదం అనంతరం సేలం టౌన్ పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని మొదట భావించారు. ఈ క్రమంలోనే డ్రైవర్‌పై ఐపీసీ సెక్షన్‌లు 279 (బహిరంగ మార్గంలో ర్యాష్ డ్రైవింగ్ లేదా రైడింగ్), 304 (ఎ) (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం) కింద కేసు నమోదు చేశారు. కానీ ఆ తర్వాత విచారణలో అసలు నిజాలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. పాపాతి ఆర్థిక పరిస్థితిని చూసి చలించిపోయారు. ఏది ఏమైనా ప్రైవేట్ కళాశాల ఫీజు కట్టలేక ఓ తల్లి ఆత్మహత్య చేసుకోవాల్సి రావడం మన దేశంలో విద్య ఎంత ఖరీదైన వ్యాపారంగా మారిందో కళ్లకు కట్టింది. బిడ్డల చదువు కోసం కన్న తల్లి ప్రాణం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి రావడం శోచనీయం.

Leave A Reply

Your email address will not be published.