ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో డిజిటల్‌ కార్డులు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో డిజిటల్‌ కార్డులు అందిచబోతున్నది. ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రూ.2 లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచిన నేపథ్యంలో కొత్తగా కార్డులను జారీ చేయాలని నిర్ణయించినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో మంగళవారం మంత్రి హరీశ్‌ రావు ఆధ్వర్యంలో బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో ఆరోగ్యశ్రీ డిజిటల్‌ కార్డులను రూపొందించి, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు.ఇందుకు లబ్ధిదారుల ఈ-కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నిమ్స్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్‌ ఆడిట్‌ నిర్వహించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ రోగులకు బయోమెట్రిక్‌ విధానంతో కొంత ఇబ్బంది ఎదురవుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఈ నేపథ్యంలో ఫేస్‌ రికగ్నైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగానికి అనుమతి ఇచ్చారు.సమావేశంలో హెల్త్‌ సెక్రెటరీ రిజ్వీ, ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈవో విశాలాచ్చి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌, డీఎంఈ రమేశ్‌ రెడ్డి, డీపీహెచ్‌ శ్రీనివాస్‌ రావు, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌, నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.