మహానంది ఆలయంలో కొండచిలువ, పాములు ప్రత్యక్షం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోనే ప్రముఖ శైవ క్షేత్రంగా మహానంది వెలుగొందుతుంది. నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆలయం నల్లమల అడవి ప్రాంతంలో ఉండటంతో కొండచిలువలు, విష సర్పాలు వంటివి ఆలయం,ఆలయం పరిసర ప్రాంతాలు, కాలనీలలో తరచూ ప్రత్యక్షం కావడం అందరిలోనూ ఆందోళన కల్గిస్తుంది. ఒక వారం పరిధిలో రెండు పెద్ద కొండచిలువలు ఆలయ పరిసరాల్లో హల్‌చల్‌ చేయడం కలకలం రేపుతుంది. వరుస సంఘటనలతో ఆలయానికి వచ్చే భక్తులు, స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
మహానంది ఆలయానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. ఆలయంలో కొలువై ఉన్న శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. ఆహ్లాదకరమైన నల్లమల అడవి ప్రాంతంలో దేవాలయం ఉండటంతో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని తన్మయత్వం పొందుతుంటారు.
ఆలయ పరిసరాలు ఆహ్లాదకరమైన వాతావరణం తో పాటు అటవీ ప్రాంతం దగ్గర గా ఉండటంతో విష సర్పాలు, కొండచిలువలు, వన్యమృగాల తాకిడి కూడా అదే విధంగా ఉంటుంది. గత వారం రోజుల పరిధిలో అతి పెద్దవైన రెండు కొండ చిలువలు ప్రత్యక్షం కావడం కలవరానికి గురి చేస్తుంది. ఒక కొండ చిలువ ఆలయం సమీపంలోని అయ్యన్న నగర్ లోని ఓ ఇంటి సమీపంలో ప్రత్యక్షం కాగా, మరో కొండ చిలువ ఆలయం పరిసరాల్లో ప్రత్యక్ష అయింది. రెండు కొండ చిలువలు స్థానిక స్నేక్ క్యాచర్ మోహన్ చాకచక్యంగా పట్టుకొని నల్లమల అడవిలో వదిలి వెయ్యడంతో స్థానికులు, భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.
గతంలో ఆలయంలో విషసర్పాలు రావడం, ఆలయ పరిసరంలో ఉండే గోశాలలోని ఆవుల మంద పై చిరుతపులి దాడి చేసే ప్రయత్నం చేసే సంఘటనలు ఆందోళ కలిగిస్తున్నాయి. విష సర్పాలు, వన్య మృగాలు ఆలయం పరిసరాల్లోకి రాకుండా ఉండే విధంగా ఆలయ అధికారులు, ఫారెస్ట్ అధికారులు ప్రతిష్ఠమైన చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.