ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది మాట్లాడొద్దు..

-  మీడియాకు దూరంగా ఉండాల‌ని ‘బండి’కి జ‌వ‌దేక‌ర్ హెచ్చ‌రిక‌..!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ‘ఢిల్లీకి పోయి ఫిర్యాదులు చేయడం ఆపండి.. కిషన్‌ రెడ్డినైనా ప్రశాంతంగా పని చేసుకోనీయండి’ అంటూ బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పెద్దలు సీరియస్‌ అయ్యారట. దీంతో ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జవదేకర్‌ తాజాగా బండిని పిలిపించుకుని క్లాస్‌ పీకినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఇలా బహిరంగ వేదికపై నోరు జారడం ఏమిటని ప్రశ్నించినట్టు సమాచారం. రాష్ట్ర పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ ఉన్న వేదికపై అలా మాట్లాడటం హద్దు మీరినట్టేనని బండికి స్పష్టం చేశారట. బీజేపీలో ఎంతో క్రమశిక్షణ కలిగిన నేతనని చెప్పుకుంటూ ఇలా మాట్లాడటం వెనుక అంతర్యం ఏమిటని నిలదీశారట.పదవిలో ఎవరు ఉండాలో, ఎవరు ఉండొద్దో నిర్ణయించేది అధిష్ఠానమైతే రాష్ట్ర నేతలకు ఎందుకు ముడిపెడుతున్నావని బండిని ప్రశ్నించినట్టు సమాచారం. దీనిపై బండి అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తనను ఏ కారణంగా తప్పించారో అధిష్ఠానం ఎందుకు చెప్పడం లేదని ఆయన అడిగినట్టు సమాచారం. పార్టీకి చేసిన సేవలకు కనీసం జాతీయ స్థాయిలో మంచి పదవి వస్తుందని ఆశిస్తే.. తూతూమంత్రంగా ఓ పదవి ముఖాన పడేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. దీంతో కొన్నాళ్లపాటు మీడియాకు దూరంగా ఉండాలని, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది మాట్లాడొద్దని బండికి జవదేకర్‌ స్పష్టం చేసినట్టు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.