గడిచిన ఐదేండ్లలో మొండి బకాయిలే దాదాపు రూ.11 లక్షల కోట్లు

-   వెల్లడించిన ఆర్బీఐ గణాంకాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రుణాలివ్వడం.. వాటిని వసూలు చేయలేక రైటాఫ్‌ చేయడం బ్యాంకింగ్‌ రంగంలో ఏటా జరిగే తంతుగానే తయారైంది.పేద, మధ్యతరగతి వర్గాలు ఈఎంఐలు చెల్లించకపోతే నోటీసులు, జప్తులతో విరుచుకుపడే బ్యాంకర్లు.. కార్పొరేట్ల విషయంలో మాత్రం సైలెంట్‌ అయిపోతున్నారు.ఏటేటా జరుగుతున్న ఈ లోన్‌ రైటాఫ్‌ల్లో కార్పొరేట్ల మొండి బకాయిలే ఎక్కువగా ఉండటం ఇందుకు నిలువెత్తు నిదర్శనం. అయితే కారకులెవరైనా నష్టపోతున్నది మాత్రం సగటు ప్రజానీకమే. నిజాయితీగా రుణాలు చెల్లిస్తున్నా.. అప్పు మాత్రం పుట్టట్లేదు మరి.దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో లోన్‌ రైటాఫ్‌లు మళ్లీ పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2022-23) రూ.2,09,144 కోట్ల మొండి బకాయిల రైటాఫ్‌ జరిగింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కోరిన వివరాలకుగాను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తాజాగా తెలియజేసింది. దీంతో గడిచిన ఐదేండ్లలో రైటాఫ్‌లు రూ.10.57 లక్షల కోట్లకు చేరాయి. అయితే ఖాతా పుస్తకాల బరువును తగ్గించుకునేందుకే ఇదంతా అని, రుణాల వసూలు ప్రక్రియ కొనసాగుతుందని బ్యాంకర్లు చెప్తున్నా.. అంతిమంగా నష్టాల నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నారు.

వసూళ్లు అంతంతే..

ఇచ్చిన రుణాలను తర్వాత వసూలు చేసుకుంటామంటూ ముందుగా రైటాఫ్‌లకు దిగుతున్న బ్యాంకులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రికవరీ మొత్తాలను చూస్తేనే ఇది అర్థమవుతున్నది. గడిచిన మూడేండ్ల విషయానికే వస్తే.. 2020-21 నుంచి 2022-23 వరకు బ్యాంకులు రూ.5,86,891 కోట్ల రుణాలను రైటాఫ్‌ చేశాయి. కానీ వసూలైంది రూ.1,09,186 కోట్లే. అంటే రికవరీ రేటు కేవలం 18.60 శాతంగానే ఉన్నది. 2020-21లో రూ.30,104 కోట్లు, 2021-22లో రూ.33,534 కోట్లు, 2022-23లో రూ.45,548 కోట్లుగా ఉన్నాయి.

రైటాఫ్‌లు చేయడం వల్లే..

బ్యాంకింగ్‌ రంగంలో మొండి బకాయిలు గణనీయంగా తగ్గుతున్నాయంటూ ఇటీవలికాలంలో బ్యాంకర్లు గొప్పలు చెప్పుకుంటున్నది చూస్తూనే ఉన్నాం. అయితే లోన్‌ రైటాఫ్‌లే ఇందుకు కారణమని నిపుణులు చెప్తున్నారు. అందుకు తగ్గట్టు గణాంకాలూ ఉన్నాయి మరి. లోన్‌ రైటాఫ్‌ల నేపథ్యంలో మొత్తం రుణాల్లో బ్యాంకర్ల స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) నిష్పత్తి పదేండ్ల కనిష్ఠాన్ని తాకుతూ ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి 3.9 శాతానికి దిగింది. 2017-18లో రూ.10.21 లక్షల కోట్లుగా ఉన్న జీఎన్‌పీఏ.. 2022-23కల్లా రూ.5.55 లక్షల కోట్లకు వచ్చినట్టు బ్యాంకింగ్‌ వర్గాలు చెప్తున్నాయి. వాస్తవానికి ఈ రైటాఫ్‌లు లేకపోతే జీఎన్‌పీఏ నిష్పత్తి 7.47 శాతంగా ఉండేదని ఎక్స్‌పర్ట్స్‌ పేర్కొంటున్నారు.

  • 2021-22లో లోన్‌ రైటాఫ్‌లు రూ.1,74,966 కోట్లు
  • 2020-21లో రూ.2,02,781 కోట్లు
  • 2012-13 నుంచి ఇప్పటిదాకా లోన్‌ రైటాఫ్‌ల విలువ రూ.15,31,453 కోట్లు
  • గడిచిన మూడేండ్లలో దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో జరిగిన లోన్‌ రైటాఫ్‌ల్లో ప్రభుత్వ బ్యాంకుల వాటానే సుమారు 62.45 శాతం
  • 2020-21 నుంచి 2022-23 వరకు పీఎస్‌యూ బ్యాంకులు రూ.3,66,380 కోట్ల రుణాలను రైటాఫ్‌ చేశాయి

లోన్‌ రైటాఫ్‌ అంటే?

బ్యాంకు లేదా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) నుంచి రుణం తీసుకున్నవారు 90 రోజులు, అంతకంటే ఎక్కువకాలంపాటు దాన్ని చెల్లించడంలో విఫలమైనప్పుడు.. సదరు అప్పు ఇచ్చిన సంస్థ ఆ లోన్‌ను నిరర్థక ఆస్తి (ఎన్‌పీఏ లేదా మొండి బకాయి)గా ప్రకటిస్తుంది. దీన్ని ఖాతా పుస్తకాల నుంచి తొలగించడమే లోన్‌

రైటాఫ్‌ చేస్తే ఏం జరుగుతుంది?

రుణాన్ని రైటాఫ్‌ చేయడం అంటే.. అసెట్‌ బుక్‌ నుంచి దాన్ని తొలగించినట్టే. అంతేగాక రుణం వసూలు చేసేందుకున్న అవకాశాలు చాలాచాలా తక్కువని రుణదాతలు (బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు) అంగీకరించినట్టే. ఈ రుణాన్ని నష్టంగా రుణదాతలు నమోదు చేసుకుంటారు. సంస్థ లాభాల్లో నుంచి ఆ మొత్తాన్ని మినహాయిస్తారు. దీనివల్ల పన్ను భారం తగ్గుతుందని రుణదాతలు చెప్తున్నారు. అయితే ఎన్‌పీఏల వసూలు ప్రక్రియ కొనసాగుతుందని అంటున్నా.. ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితం ఉండదని బ్యాంకింగ్‌ రంగ వర్గాలు పేర్కొంటున్నాయి.

Leave A Reply

Your email address will not be published.