తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్ : గత కొన్ని రోజులుగా తెలంగాణలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్ నగరం జలవిలయంతో చిగురుటాకులా వణికిపోతోంది. మరోసారి తెలంగాణకు వర్షం ముప్పు పొంచి ఉందని వాతవరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభం కావడంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. మరో వారం, పది రోజుల్లో తెలంగాణ నుంచి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమిస్తాయని తెలిపారు. ఈ నెల 18న ఉత్తర అండమాన్‌, దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. ఈ ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై హైదరాబాద్ నగరంలో పలు చోట్ల జల్లులు పడతాయన్నారు. హైదరాబాద్‌లో మరో రెండు గంటల్లో చిరు జల్లులు పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఆ తరువాత తగ్గుముఖం పట్టి సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో జల్లులు పడే అవకాశం ఉన్నట్లు వాతవరణశాఖ అధికారులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.