రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కార్యక్రమం పున: ప్రారంభం

-    రైతుల రుణమాఫీపై కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం

 తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదల చేయకుండా కేంద్రం, తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు… తదితర కారణాల వల్ల ఆర్థికలోటుతో ఇన్నాల్లు కొంత ఆలస్యమైందని కేసీఆర్ తెలిపారు. తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్ననేపథ్యంలో రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్ లో బుధవారం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఎ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ‘‘ ఇచ్చిన మాట ప్రకారం, రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగించాం. రైతులకు అందిచాల్సిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో నిరాఘటంగా కొనసాగిస్తూనే వస్తోంది. మేం ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆరునూరయినా రైతుల సంక్షేమాన్ని వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదు. పైగా వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాం. తద్వారా రైతు సాధికారత సాధించే వరకు వారిని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తేలేదు.’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో రూ.19 వేల కోట్ల రుణమాఫీని రైతులకు అందించాల్సి ఉందని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రేపు అనగా ఆగస్టు 3వ తేదీ నుంచి పున: ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెలపదిహేనురోజుల్లో సెప్టెంబర్ రెండో వారం వరకు రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.