రాయలసీమకు అన్యాయం జరిగితే సహించేది లేదు

-   రాయలసీమ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాయలసీమకు అన్యాయం జరిగితే సహించేది లేదని రాయలసీమ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గతనెల 28న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర చేసిన దీక్షకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లయింది. డివిజన్ బిల్లులోని రాయలసీమకు రావలసిన ప్యాకేజీలు రాలేదు. ప్రశ్నించక పోవడం వల్లనే రాయలసీమకు అన్యాయం జరుగుతోంది. ఏపీలో పొత్తుల విషయంలో బీస్ సాల్ బాద్ సినిమాలో మాదిరిగా ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో మాదిరిగా ముందొచ్చిన వారికే బీజేపీ సపోర్ట్ చేస్తుంది. కర్ణాటక ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులను కట్టి రాయలసీమను ఉరి కంభం ఎక్కిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదు. రాయలసీమను తాకట్టు పెట్టి పొత్తుల కోసం పోటీ పడుతున్నారు. పవన్ కళ్యాణ్ మీసాలు, తొడలు కొడుతున్నాడు. ఆయన తొడలు కొట్టేదాన్ని మేనిఫెస్టోలో పెడతారేమో. తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతంలో కర్ణాటక ప్రభుత్వం కడుతున్న అప్పర్ భద్ర, నవలీ అక్రమ ప్రాజెక్టులపై టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీల స్టాండ్ ఏమిటో తెలపాలి. సిద్దేశ్వరం దగ్గర కృష్ణానదిపై తీగల వంతెనపై టీడీపీ, వైసీపీ ఎందుకు మాట్లాడటం లేదు. పార్లమెంట్ డివిజన్ బిల్లులో పాసైన ఎయిమ్స్‌ను రాయలసీమ నుంచి అమరావతికి తరలింపుపైన, కేఆర్‌ఎంబీ ఎక్కడ పెట్టాలో.. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్న రాజకీయ పార్టీలు క్లారిటీ ఇవ్వాలి. జీవో నెంబర్ 69 రాయలసీమ కొంప ముంచుతోంది. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై టీడీపీ, వైసీపీ పార్టీలు ఢిల్లీలో తిరుగుబాటుకు దిగాలి. రాయలసీమ హక్కుల కోసం త్వరలో రాయలసీమ రచ్చబండ కార్యక్రమం డోన్ నుంచి ప్రారంభిస్తాను.’’ అని బైరెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.