మ‌ణిపూర్ అంశంపై విప‌క్షాలు వెన‌క్కి త‌గ్గాయా!?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పార్ల‌మెంట్‌లో కొన‌సాగుతున్న ప్ర‌తిష్టంభ‌న‌కు విప‌క్షాలు చెక్ పెట్టే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. విప‌క్ష కూట‌మి ఇచ్చిన కొత్త ప్ర‌తిపాద‌న‌తో స‌భ స‌జావుగా సాగేందుకు అవ‌కాశాలు ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌ణిపూర్ అంశంపై ప్ర‌ధాని మోదీ స‌భ‌లో ప్ర‌క‌ట‌న చేయాల‌ని విప‌క్ష ఎంపీలు భీష్మించుకున్న విష‌యం తెలిసిందే. అయితే రాజ్య‌స‌భ‌లో విప‌క్ష ఎంపీలు కాస్త త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. ఇవాళ కాంగ్రెస్ ఎంపీ జ‌య‌రాం ర‌మేశ్ చేసిన ఓ ట్వీట్ ఆ సంకేతాన్ని ఇస్తోంది. ప్ర‌తిష్టంభ‌న తొలిగిపోవ‌డానికి ఇండియా కూట‌మి మధ్యేమార్గాన్ని ప్ర‌భుత్వానికి సూచించిన‌ట్లు ఆయ‌న త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు.మ‌ణిపూర్ ఇష్య‌పై రూల్ 267 కింద సుదీర్ఘ చ‌ర్చ చేప‌ట్టాల‌నిప్ర‌ధాని మోదీ స‌భ‌లో ప్ర‌క‌ట‌న చేయాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక రూల్ 176 కింద ఆ అంశంపై చ‌ర్చ‌కు సిద్ధ‌మే అని కేంద్రం చెబుతోంది. కానీ పార్ల‌మెంట్ ప్రారంభ‌మై 10 రోజులు గ‌డుస్తున్నా.. స‌భా కార్య‌క్ర‌మాలు స‌జావుగా సాగ‌డం లేదు. వాయిదాల ప‌ర్వంతో స‌మ‌యం అంతా వృధా పోతోంది. ఈ నేప‌థ్యంలో ఇండియా కూట‌మి కొత్త ప్ర‌తిపాద‌న చేసింది. రూల్ 167 కింద చ‌ర్చ చేప‌ట్టాల‌ని విప‌క్షాలు సూచించిన‌ట్లు తెలుస్తోంది. అయితే రూల్ 167 కింద ఆ అంశంపై ఓటింగ్ కూడా ఉంటుంది. కానీ ప్ర‌ధాని స్టేట్‌మెంట్‌పై విప‌క్షాలు వెన‌క్కి త‌గ్గాయా లేదా అన్న అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

Leave A Reply

Your email address will not be published.