నూతనోత్సాహంతో పార్లమెంటుకు బయల్దేరిన రాహుల్ గాంధీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ అయిన తర్వాత నూతనోత్సాహంతో మంగళవారం ఉదయం పార్లమెంటుకు బయల్దేరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చను ఆయన ప్రారంభించబోతున్నారు. ఆయన మోదీ ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ఎండగట్టబోతున్నారు.కాంగ్రెస్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, అవిశ్వాస తీర్మానంపై చర్చను రాహుల్ గాంధీ ప్రారంభిస్తారు. మణిపూర్ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారు. రాహుల్ జూన్‌లో మణిపూర్‌లో పర్యటించి, స్థానిక పరిస్థితులను తెలుసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రతిపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A) ఎంపీలు కూడా ఆ రాష్ట్రంలో పర్యటించి, స్థానిక సమస్యలను పరిశీలించి, గవర్నర్‌కు, రాష్ట్రపతికి నివేదికలు సమర్పించారు.‘మోదీ ఇంటి పేరు’ కేసులో రాహుల్ గాంధీ దోషి అని గుజరాత్‌లోని సూరత్ కోర్టు తీర్పు చెప్పడంతో ఆయన లోక్ సభ సభ్యత్వం రద్దయిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట లభించడంతో ఆయన లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ అయింది.

Leave A Reply

Your email address will not be published.