గద్దర్‌ మరణం పై చర్చనీయంగా మారిన బీఆర్‌ఎస్‌ పార్టీ తీరు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గద్దర్‌ మరణం పై  అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవహరించిన తీరు చర్చనీయంగా మారింది. గద్దర్‌.. తెలంగాణ గొంతుక! ఉద్యమంలో ఆయన పాటకు ప్రత్యేక స్థానముంది! ప్రత్యేక రాష్ట్రం కోసం నినదించి యువతను ఉద్యమంవైపు నడిపించిన యుద్ధ నౌక! పీడితుల బతుకు పాటకు నిలువెత్తు రూపమైన ప్రజా వాగ్గేయకారుడి మరణంతో యావత్‌ తెలుగు సమాజం దిగ్ర్భాంతికి లోనైంది. లెఫ్ట్‌, రైట్‌ భావజాల వైరుధ్యాలను పక్కనపెట్టి.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ వెల్లువెత్తారు. తొలుత స్పందించకుండా.. కాంగ్రెస్‌ నేతలు అంతా తామై వ్యవహరించడాన్ని చూసిన తర్వాత.. అనివార్య పరిస్థితుల్లోనే బీఆర్‌ఎస్‌ నేతలు స్పందించి తగిన చర్యలు తీసుకున్నారనే విమర్శలు బలంగా వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ కూడా ఎన్నికల, క్రెడిట్‌ రాజకీయాలకు పాల్పడడం పలువురిని నివ్వెరపరిచింది. నిజానికి, గద్దర్‌ మరణించారని తెలిసిన వెంటనే అందరి కంటే ముందు ఆదివారం కాంగ్రెస్‌ నేతలు స్పందించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఆ పార్టీ ఎమ్మెల్యే సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఆస్పత్రికి తరలి వెళ్లారు. గద్దర్‌ పార్థివ దేహాన్ని సందర్శించారు. వాస్తవానికి, గద్దర్‌ మరణ వార్త తెలిసే సమయానికి రేవంత్‌ రెడ్డి విలేకరుల సమావేశంలో ఉన్నారు. దానిని రద్దు చేసుకుని మరీ ఆయన హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ అంతా తామై వ్యవహరించారు. వెంటనే పార్థివ దేహాన్ని ఎల్బీ స్టేడియానికి తరలించడంలో చొరవ తీసుకున్నారు. అక్కడి గేట్లను కూడా వారే తీయించి, మృతదేహాన్ని అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచి, ఇతర ఏర్పాట్లు పర్యవేక్షించారు. అదే సమయంలో అసెంబ్లీ కొనసాగుతోంది. అప్పుడు సీఎం కేసీఆర్‌ సభలో మాట్లాడుతున్నారు. ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించిన కొద్ది సేపటికే గద్దర్‌ చనిపోయినట్లు సమాచారం అందింది. అయినా.. కేసీఆర్‌ మాత్రం గద్దర్‌ గురించి సభలో ప్రస్తావించలేదు. సుదీర్ఘంగా ప్రసంగించిన కేసీఆర్‌ గద్దర్‌ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకపోవడం ఆయన అభిమానులను నిరాశపర్చింది. చివరకు, మంత్రి కేటీఆర్‌ గద్దర్‌ గురించి మాట్లాడి, సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

Leave A Reply

Your email address will not be published.