ఆధునిక సామాజిక మత సంస్కర్త రాజా రామ్‌మోహన్‌ రాయ్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆధునిక భారతదేశంలో సామాజిక మత సంస్కరణల కోసం పాటుపడిన మొదటి వ్యక్తి రాజా రామ్‌మోహన్‌ రాయ్‌. అందుకే ఆయనను ‘భారతదేశపు మొదటి ఆధునికుడు’గా పరిగణిస్తారు. రాయ్‌ 1772లో పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే ఆయన స్వేచ్ఛగా, హేతుబద్ధంగా ఆలోచించేవాడు. హిందు, మహమ్మదీయ, క్రైస్తవ మతగ్రంథాలను క్షుణ్నంగా చదివాడు. బెంగాలీ, ఇంగ్లిష్‌, సంస్కృతం, పర్షియన్‌, అరబీ, ఫ్రెంచ్‌, లాటిన్‌, గ్రీక్‌, హీబ్రూ తదితర భాషలు ఆయనకు కరతలామలకం. 1815లో ఆత్మీయ సభ స్థాపించాడు. ఇదే 1828లో బ్రహ్మసభగా పరివర్తన చెందింది. దేవుడు ఒక్కడే అని రాయ్‌ బోధించాడు. ఉపనిషత్తులు, బైబిల్‌, ఖురాన్‌ ఆధారంగా తన బోధనలను ప్రచారం చేశాడు. రాయ్‌ అనంతరం మహర్షి దేవేంద్రనాథ్‌ టాగూర్‌ బ్రహ్మసభ పేరును బ్రహ్మసమాజంగా మార్చాడు. రాయ్‌ కృషి వల్లే అప్పటి గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ విలియం బెంటింక్‌ 1829లో సతీ సహగమన నిషేధ చట్టం అమలులోకి తెచ్చాడు. దీనితోపాటు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వితంతు పునర్వివాహాలకు అనుకూలంగా, ఆస్తిలో మహిళలకు హక్కుల కోసం పోరాడాడు. భారతీయ సమాజానికి కుల వ్యవస్థ ఆటంకమని రాయ్‌ భావించాడు. సర్వమానవ సమానత్వాన్ని కోరుకున్నాడు. ఆధునిక విద్యా విధానం ప్రవేశ పెట్టడానికి కృషిచేశాడు. 1817లో డేవిడ్‌ హేర్‌తో కలిసి హిందూ కాలేజీని స్థాపించాడు. బాలికల విద్య కోసం పాఠశాలలు ఏర్పాటుచేశాడు. పత్రికా రంగంలోనూ రాయ్‌ తనదైన ముద్రవేశాడు. తొలి బెంగాలీ వారపత్రిక సంవాద్‌ కౌముది ప్రారంభించాడు. పత్రికా స్వేచ్ఛ కోసం గొంతెత్తాడు. రాయ్‌ 1833లో ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్‌లో మరణించాడు.

Leave A Reply

Your email address will not be published.