మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోప్రభుత్వ ఉద్యోగుల అక్రమాస్తుల చిట్టా

- జీతం నెలకు రూ.45 వేలు.. రూ.10 కోట్లకు పైగా విలువైన ఆస్తులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారుల అక్రమాస్తుల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇటీవలే ఆ రాష్ట్ర పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ లో కాంట్రాక్టు ఇన్‌ఛార్జి అసిస్టెంట్‌ ఇంజినీర్‌ అక్రమాస్తులు చూసి అధికారులు షాక్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఓ రిటైర్డ్‌ ఉద్యోగి ఆస్తులు చూసి విస్తుపోయారు. ఆరోగ్య శాఖలో చిరుద్యోగిగా పనిచేసిన వ్యక్తి ఏకంగా రూ.కోట్లల్లో ఆస్తులను కూడబెట్టారు.

అష్పాక్ అలీ మధ్యప్రదేశ్‌ ఆరోగ్య శాఖ విభాగం లో స్టోర్‌ కీపర్‌ గా పని చేస్తూ నెలకు రూ.45 వేల జీతం పొందేవాడు. ప్రస్తుతం అతను రిటైర్‌ అయ్యారు. అయితే, అలీ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు సమాచారం అందుకున్న లోకాయుక్త అధికారులు ఆయన ఇంట్లో తాజాగా సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో రూ.10 కోట్లకు పైగా విలువైన ఆస్తులను కొనుగొన్నారు. రూ.46 లక్షల విలువైన బంగారం, వెండితోపాటు రూ.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాదు.. అలీ ఇంట్లోని వస్తువులు చూసి అధికారులు నోరెళ్లబెట్టారు. మాడ్యులర్‌ కిచెన్‌, లక్షల రూపాయల విలువైన షాన్డిలియర్‌, ఖరీదైన సోఫాలు, సోకేసులు, రిఫ్రిజరేటర్‌, టీవీ ఉన్నాయి. ఓ చిరుద్యోగిగా పనిచేసిన వ్యక్తి ఇంట్లో ఇంత ఖరీదైన వస్తువులు చూసి షాక్‌ అయ్యారు. మొత్తం ఆయన ఆస్తుల విలువ రూ. 10 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అలీ భార్య, కుమారుడు, కుమార్తె పేరిట ఉన్న రూ. 1.25 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన 16 స్థిరాస్తుల పేపర్లు అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

వీటితోపాటు నాలుగు భవనాలు, ఒక నిర్మాణంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ గురించి కూడా సమాచారం అందుకున్నారు. అంతేకాదు, మూడంతస్తుల భవనంలో ఓ పాఠశాలను కూడా నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఈ మేరకు అలీపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రభుత్వ కాంట్రాక్ట్‌ ఉద్యోగిని మరో అవినీతి భాగోతం

మధ్యప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ లో కాంట్రాక్టు ఇన్‌ఛార్జి అసిస్టెంట్‌ ఇంజినీర్‌ గా పనిచేస్తున్న హేమ మీనా ఇంట్లో మే నెలలో లోకాయుక్త అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. నెలకు రూ.30వేలు జీతం తీసుకునే మీనా.. కోట్లల్లో ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది. ఆ సోదాల్లో ఏకంగా రూ.7 కోట్లకు పైనే ఆస్తులు బయటపడ్డాయి. వాటితోపాటు 7 లగ్జరీ కార్లు, విలువైన గిర్‌ జాతికి చెందిన రెండు డజన్ల పశువులతోపాటు రూ.30 లక్షల విలువ చేసే 98 ఇంచెస్‌ అత్యాధునిక టీవీ, కోటి విలువైన విలాసవంతమైన ఇల్లు, ఆమె నివాస ప్రాంగణంలో 100 కుక్కలు, పూర్తి వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్‌, మొబైల్‌ జామర్‌లు, ఇతర విలువైన వస్తువులను కూడా అధికారుల సోదాల్లో బయటపడ్డాయి.

Leave A Reply

Your email address will not be published.