గృహలక్ష్మిపథకానికి ఆహార భద్రత కార్డు వారందరూ అర్హులే

- గృహలక్ష్మి కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారమ్ లేదు.. తెల్లకాగితంపై రాసిన చాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గృహలక్ష్మిపథకానికి ఆహార భద్రత కార్డు వారందరూ అర్హులేనని బీసీ సంక్షేమపౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో జిల్లాలోని ఎమ్మెల్యేలుఎమ్మెల్సీఅధికారులతో కలిసి దళితబంధుబీసీ కులవృత్తులకు చేయూతసబ్సిడీ గొర్రెల పంపిణీ పథకాల పై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.

ఇప్పటికే ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ఇండ్లను నిర్మించి ఇస్తుందని పేర్కొన్నారు. సొంత జాగ ఉండి

 ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి గృహలక్ష్మి పథకం కింద రూ. 3 లక్షలు ఆర్థిక సహాయం అందించనుందని తెలిపారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత గృహలక్ష్మి పథకం కింద 10వేల 500 మంజూరు చేస్తున్నామని ప్రకటించారు.

లబ్ధిదారులు తెల్ల కాగితంపై గ్రామీణ ప్రాంతాల వారు తహసీల్దార్‌కు, పట్టణ ప్రాంతాల ప్రజలు మునిసిపల్ కార్యాలయాల్లో తెల్లకాగితంపై రాసి దరఖాస్తులు అందించాలని సూచించారు. గృహలక్ష్మి కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారమ్ అంటూ ఏది లేదని,  సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫారమ్ తో ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. లబ్ధిదారుల ఎంపిక జిల్లా మంత్రి, కలెక్టర్ రూపొందిస్తారన్నారు. గృహలక్ష్మి పథకం అమలు కోసం నియోజకవర్గానికి ఒక నోడల్ ఆఫీసర్ ప్రతి మండలానికి ఒక స్పెషల్ వెరిఫికేషన్ అధికారిని నియమించామని చెప్పారు.

మూడు విడతలుగా గృహలక్ష్మీ నిధులు

ప్రభుత్వం అందించే 3 లక్షల రూపాయలను మూడు విడతలుగా అందిస్తామని వెల్లడించారు. అందులో బెస్ మెంట్ పూర్తికాగానే మొదటి విడతగా రూ. లక్ష, రూఫ్ పూర్తి కాగానే 2వ విడతగా మరో రూ. లక్ష, నిర్మాణం పూర్తి అయిన తర్వాత 3వ విడతలో చివరి లక్ష రూపాయలు అందిస్తామన్నారు. గృహలక్ష్మి లబ్దిదారులు ఎవరికి నచ్చిన విధంగా వారు ఇల్లు నిర్మించుకోవచ్చని సూచించారు.

గృహలక్ష్మి పథకం కింద ఈ నెల 10వ తేదీవరకు దరఖాస్తులు స్వీకరించి, 20వ తేదీలోగా లబ్దిదారుల వెరిఫికేషన్ పూర్తిచేస్తామన్నారు. 25వ తేదీన మొదటి విడత లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. లబ్ధిదారుల్లో ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 10 శాతం, బీసీలు 50 శాతం, దివ్యాంగులకు 5 శాతం మించకుండా ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. గృహలక్ష్మి పథకం మహిళ పేరుతో అందజేస్తామని వివరించారు. స్థలం మహిళ పేరుతో ఉండాల్సిన అవసరం లేదన్నారు. పథకం కోసం మహిళ పేరిట నూతన బ్యాంకు అకౌంట్ తీయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ సమీక్షలో నగర మేయర్ వై సునీల్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మానకొండూర్ చొప్పదండి , హుస్నాబాద్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, సంతోష్ కుమార్‌, జిల్లా కలెక్టర్ బి. గోపి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.