తన ప్రతిష్టను దిగజార్చేందుకు ఫోర్జరీ పేరుతో బురద జల్లుతున్నారు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నలుగురు ఎంపీల సంతకాల ఫోర్జరీ ఆరోపణలపై ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా ను శుక్రవారం రాజ్యసభ నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. తన సస్పెన్షన్‌పై రాఘవ్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ఆ వీడియోలో తనకు తాను రాజ్యసభ నుంచి సస్పెండ్‌ అయిన ఎంపీ గా చెప్పుకున్నారు. తన ప్రతిష్టను దిగజార్చేందుకు ఫోర్జరీ పేరుతో బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సవాళ్లకు తాను భయపడేది లేదని, పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ‘నమస్కారం, నేను సస్పెండైన ఎంపీ రాఘవ్‌ చద్దాను. అవును.. నన్ను రాజ్యసభ నుంచి సస్పెండ్‌ చేశారు. నేను ఏం నేరం చేశాను..? నేను కొంతమంది ఎంపీల సంతకాలను సేకరించానని బీజేపీ చెబుతోంది. ఇప్పుడు మీకు నేను అసలు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏ పార్లమెంటేరియన్‌కు అయినా కమిటీ పేర్లను ప్రతిపాదించే హక్కు ఉంటుంది. అంటే నేను సెలక్ట్ కమిటీకి పేర్లను ప్రతిపాదించగలను. అలా చేయడానికి ఆ ఎంపీల సమ్మతి, సంతకం అవసరం ఉండదు. వారి పేర్లను ఇస్తే సరిపోతుంది. ఏ ఎంపీకి అయినా అందులో అభ్యంతరం ఉంటే తమ పేరును ఉపసంహరించుకోవచ్చు. నేను ఎలాంటి సంతకాలను సమర్పించలేదు’ అని వీడియోలో రాఘవ్‌ చద్దా వెల్లడించారు.నలుగురు ఎంపీల సంతకాల ఫోర్జరీ ఆరోపణపై ఆప్‌ రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దాను శుక్రవారం రాజ్యసభ నుంచి సస్పెండ్‌ చేశారు. నిబంధనల అతిక్రమణ, ధిక్కార వైఖరి, అనుచిత ప్రవర్తన కారణాలతో ఆయనను రాజ్యసభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు సభ చైర్మెన్‌ ధన్‌కర్‌ ప్రకటించారు. దీనిపై సభా హక్కుల కమిటీ దర్యాప్తు జరిపి నివేదిక ఇచ్చేంత వరకు అతనిపై నిషేధం కొనసాగుతుందన్నారు. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.

Leave A Reply

Your email address will not be published.