కామారెడ్డిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.45 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మున్సిపల్, ఐటీ శాఖ‌ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. సోమవారం అయన రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి కామారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.28 కోట్లతో నిర్మించిన ఆరు లేన్ల‌ రహదారి, స్వాగత తోరణం, సెంట్రల్ లైటింగ్, మీడియన్, రోడ్డు డివైడర్లను ప్రారంభించారు.

 

ఈ సందర్బంగా ఆర్ అండ్ బీ చౌరస్తా వద్ద కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. దాదాపు రూ. 28 కోట్లతో సెంట్రల్ లైటింగ్, ఆరు వరుసల రోడ్డు, స్వాగత‌ తోరణం, సెంట్రల్ మీడియన్ ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని అన్నారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి కోసం రూ. 25 కోట్లు మంజూరు చేయాలని గంప గోవర్ధన్, సీఎం కేసీఆర్‌ను కోరగా, రూ. 25 కోట్లు మంజూరు చేస్తూ ఈ రోజే ఉత్తర్వులు జారీ చేశారని వెల్లడించారు. పట్టణంలో మున్సిపల్ డిపార్ట్‌మెంట్‌ రోడ్లు, స్టేడియం కోసం, అంతర్గత రహదారుల కోసం రూ. 20 కోట్లు మంజూరు చేయాలని, కోరగా తానూ మంజూరు చేసినట్లు తెలిపారు. సౌమ్యుడైన గంప గోవర్ధన్ కామారెడ్డి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి, జిల్లా కేంద్రంగా మార్చి, కలెక్టర్, ఎస్పీ కార్యలయాలు, మెడికల్ కళాశాల, సువిశాల రోడ్లు తదితర అభివృద్ధి పనులు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.

కేటీఆర్‌కు ఘన స్వాగతం

మంత్రి కేటీఆర్ రోడ్డు మార్గం ద్వారా ఉదయం 11:15 గంటలకు కామారెడ్డికి చేరుకొని, నేరుగా ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌కు వెళ్లారు. అక్కడ 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకొని, అనంతరం అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేల సంఖ్యలో ప్రజలు, కళాకారులు, మెకానిక్‌లు, బీఆర్ఎస్‌ శ్రేణులు తరలివచ్చారు. మంత్రికి అడుగడుగునా ఘనంగా స్వగతం పలికారు. అనంతరం మంత్రి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి టూరిజం బస్సులో బయలుదేరి వెళ్లారు. దేవునిపల్లి వద్ద కొందరు కాంగ్రెస్ నాయకులు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించగా, పోలీసులు వారిని తరిమికొట్టారు.

Leave A Reply

Your email address will not be published.