సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ దాడులు పెంచారు

- ఎన్నికల కమిషన్‌ను బలహీనపరిచారు - ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎండగట్టింది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: స్వాతంత్ర్య దినోత్సవాలనాడు ప్రభుత్వాలను విమర్శించే అలవాటు కాంగ్రెస్‌కు చాలా కాలం నుంచి లేదు. కానీ ఈ ఏడాది ఆ సంప్రదాయాన్ని పక్కనబెట్టి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎండగట్టింది. మోదీ ఎర్ర కోట నుంచి ప్రసంగించే సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గైర్హాజరై, కాంగ్రెస్ కార్యాలయంలోనే జాతీయ జెండాను ఆవిష్కరించారు. గత కాలపు ప్రధాన మంత్రులు దేశాభివృద్ధి కోసం చేసిన కృషిని వివరిస్తూ, మోదీపై పరోక్ష విమర్శలు గుప్పించారు.మోదీ ఎర్ర కోటపై నుంచి చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు గత కొన్నేళ్లలో మాత్రమే జరిగాయనే భావనను సృష్టిస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రధాన మంత్రులు దేశాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారన్నారు. వారు దేశ నిర్మాణం కోసం ఎంతో శ్రమించారన్నారు. మన రాజ్యాంగం యొక్క కొన్ని ముఖ్య లక్షణాలపై దాడి జరుగుతోందని ఆరోపించారు.

స్వాతంత్ర్య దినోత్సవాలనాడు ఓ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం చాలా దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. ఎర్ర కోట వద్ద ఏర్పాటు చేసిన సభలో కొన్ని కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. వాటిలో ఒకటి మల్లికార్జున ఖర్గే కోసం కేటాయించిన కుర్చీ. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం, ఆయనకు ఒంట్లో కాస్త నలతగా ఉండటం వల్ల ఆయన సభకు హాజరు కాలేకపోయారని తెలుస్తోంది.

కానీ ఖర్గే ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో జెండాను ఎగురవేశారు. ఆయన కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించడం ఇదే మొదటిసారి. ఆయన ప్రసంగంలో ప్రభుత్వంపై దాడి చేశారు. ఈ విధంగా ఓ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. స్వాతంత్ర్య దినోత్సవాలనాడు ప్రభుత్వాన్ని విమర్శించే అలవాటు కాంగ్రెస్‌కు గతంలో లేదు.

ఖర్గే విడుదల చేసిన వీడియో సందేశంలో, గత కాలపు ప్రధాన మంత్రులు ఈ దేశాభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. తొలి ప్రధాని నెహ్రూ, ఆ తర్వాత వచ్చిన ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహా రావు, మన్మోహన్ సింగ్ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారన్నారు. బీజేపీ నేత అయిన అటల్ బిహారీ వాజ్‌పాయి ప్రధాన మంత్రిగా పోషించిన పాత్రను కూడా ప్రస్తావించారు. ప్రతి ప్రధాన మంత్రి ఈ దేశ ప్రగతి కోసం పాటుపడ్డారన్నారు. నేడు కొందరు వ్యక్తులు గత కొన్ని సంవత్సరాల్లో మాత్రమే అభివృద్ధి జరిగినట్లు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీని ఆయన పరోక్షంగా ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

అటల్ బిహారీ వాజ్‌పాయి సహా ప్రతి ప్రధాన మంత్రి దేశం గురించి ఆలోచించారన్నారు. అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నారన్నారు. నేడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వతంత్ర ప్రతిపత్తిగల వ్యవస్థలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయని చెప్పడం తనకు చాలా బాధగా ఉందన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం కోసం కొత్త కొత్త సాధనాలను వాడుతున్నారన్నారు. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ దాడులు మాత్రమే కాకుండా ఎన్నికల కమిషన్‌ను కూడా బలహీనపరిచారన్నారు. ప్రతిపక్ష ఎంపీలపై దౌర్జన్యం చేస్తున్నారని, సస్పెండ్ చేస్తున్నారని, మైకులను పనిచేయనివ్వడం లేదని, ప్రసంగాలను రికార్డుల నుంచి తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. తన మైకును కూడా మ్యూట్ చేశారన్నారు. గొప్ప వ్యక్తులు నూతన చరిత్రను రాయడం కోసం పాత చరిత్రను చెరిపేయరని, వారు తమ గీతను పెద్దగా గీస్తారని చెప్పారు. అప్పటికే ఉన్న గీతను కత్తిరించడం ద్వారా కానీ, చెరిపేయడం ద్వారా కానీ పాత గీతను చిన్నదానిగా చేయరని తెలిపారు.

ఐఐటీలు ఐఐఎంలు ఎయిమ్స్, అంతరిక్ష, అణు పరిశోధన సంస్థలు వంటివాటిని గతంలో ఏర్పాటు చేసినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం ఆ విషయాన్ని మరుగుపరుస్తోందన్నారు. వీటిని ఏర్పాటు చేయడం అభివృద్ధికి సంకేతమని చెప్పారు.

ఎర్ర కోట వద్ద ప్రధాని ప్రసంగానికి తాను హాజరుకాకపోవడానికి కారణాన్ని ఖర్గే వివరించారు. తనకు కంటి సమస్య ఉందని, తాను తన నివాసంలో, ఆ తర్వాత కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించాలని అనుకున్నానని చెప్పారు. ఎర్ర కోట వద్ద ప్రధాని, తదితరుల కోసం భద్రత చాలా పటిష్టంగా ఉంటుందన్నారు. హోం మంత్రి, రక్షణ మంత్రి, సభాపతి, మరికొందరు వెళ్లే వరకు తనను వెళ్లనివ్వరని, అందువల్ల సభకు హాజరవడం అసాధ్యమవుతుందని చెప్పారు.

స్వాతంత్ర్యం కోసం అసువులుబాసిన భారతీయులందరికీ ఖర్గే నివాళులర్పించారు. జాతీయోద్యమానికి వారంతా కృషి చేయడం మాత్రమే కాకుండా, భారత దేశానికి బలమైన పునాదిని నిర్మించారన్నారు.

Leave A Reply

Your email address will not be published.