సర్వకాలాల్లో బాహ్యంగా, మానసికంగా శుద్ధి ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది

- బూజు కొట్టుకుపోయిన పైకప్పు, మురికిపట్టిన గచ్చుతో కళావిహీనంగా ఉండే ఇండ్లలో లక్ష్మీదేవి అరక్షణం కూ డా నిలువదు.  - తిట్లు, శాపనార్థాలు, పరనింద చేసే మనుషులున్న ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడదు.

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కష్టానికి ప్రతిఫలం లక్ష్మి. సంతోషాలకు ఆధారం ఆ శ్రీదేవే! సంతృప్తికి మూలం ఆవిడే!! మహాలక్ష్మి కటాక్షం కోసం లోకమంతా ఎదురు చూస్తుంటుంది. అష్టలక్ష్ముల చూపుతో.. అష్టదరిద్రాలూ తీరిపోతాయని తహతహలాడుతుంటారు జనులు. ఆ తల్లి కరుణ అణువంత ప్రసరిస్తే చాలని ఆకాంక్షిస్తుంటారు. శ్రీహరి గుండెలపై కొలువై ఉన్న సంపదల సీమంతిని.. శ్రావణ దీప్తిగా, వరలక్ష్మిగా పూజలు అందుకునే కాలమిది. పూజలు, వ్రతాలు, నోములు చేయడంతో ఆ అమ్మ తప్పక సంతోషిస్తుంది! అదే సమయంలో మన నడత సక్రమంగా ఉంటే మరింత అనుగ్రహిస్తుంది.

గుణగణాలే లక్ష్మి

లక్ష్మి అంటే ‘శుభలక్షణ లక్షిత’ అని అర్థం ఉంది. మనిషి రూపురేఖలు ఎలా ఉన్నా, గుణగణాలు సక్రమంగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మనలోని శుభ లక్షణాల కలబోతే లక్ష్మి. ధైర్యం, వీర్యం, ఆరోగ్యం, బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే. వీటినే ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి అని వివిధ పేర్లతో, పలు రూపాల్లో కొలుస్తుంటాం. పవిత్రంగా, ప్రశాంతంగా ఉండే ఇండ్లలో, మనుషులతో తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవే ప్రకటించింది.

శుద్ధ (సిద్ధ)లక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ

శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా’ అన్నారు పెద్దలు. శుద్ధలక్ష్మి అంటే పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఆమె ఉంటుంది. ఇంటినీ, తమ ఒంటినీ శుభ్రంగా ఉంచుకున్న వారింటికి పిలవకపోయినా సిరి నడిచి వస్తుంది. శుద్ధి అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు! అంతర్‌ శుద్ధి కూడా. సర్వకాలాల్లో బాహ్యంగా, మానసికంగా శుద్ధి ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది. బూజు కొట్టుకుపోయిన పైకప్పు, మురికిపట్టిన గచ్చుతో కళావిహీనంగా ఉండే ఇండ్లలో లక్ష్మీదేవి అరక్షణం కూ డా నిలువదు. తిట్లు, శాపనార్థాలు, పరనింద చేసే మనుషులున్న ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడదు. నిరంతరం శుభాన్ని కోరేవారు, శాంత స్వభావులు, ఇంద్రియ నిగ్రహం కలవారు, పరులకు సాయం చేసేవారు, అతిథులను గౌరవించేవారు, కాలం వృథా చేయనివా రు, కృతజ్ఞత చూపేవారు, సమర్థంగా పని చేసేవారు.. ఇలాంటి సద్గుణాలు కలిగిన వారింట నేనుంటానని లక్ష్మీదేవి స్వయంగా రుక్మిణీదేవికి చెప్పిందని పురాణ గాథ. లక్ష్మి నిలిచిన చోట సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. శ్రమైక జీవన సౌందర్యమే లక్ష్మి. కష్టపడేవారిని సదా అనుగ్రహిస్తుందామె. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఐశ్వర్యంలో మునిగిపోవడం కాదు. డబ్బు మాత్రమే కాదు. జ్ఞానం, సంతృప్తి, ప్రశాంతత, ఆనందం ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలే!

ప్రకృతి స్వరూపం

మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా లక్ష్మీదేవి ప్రతిరూపమే. ఆ తల్లిని ‘ప్రకృత్యై నమః’ అని స్తుతించారు. ప్రకృతిలోని ప్రతి సంపదా తనే. పాంచభౌతిక శక్తులైన భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశాలను సమన్వయపరిచి పుడమిపై నివసించే ప్రాణులకు రక్షణ కల్పించే శక్తి లక్ష్మి. పంటపొలాల్లోనే కాదు, పచ్చని చెట్లలోనూ ఆమె నివసిస్తుంది. ముఖ్యంగా బిల్వ వృక్షాలు లక్ష్మీ నివాసాలని శ్రీ సూక్తం చెబుతున్నది. చెట్లు నాటేవారినీ ఆమె అనుగ్రహిస్తుందట. తొలి సంధ్య కిరణాల్లోని లక్ష్మీ శక్తి భూమిలో ఖనిజాలను సృష్టిస్తుందని వేదమంత్రాలు చెబుతున్నాయి.

మోక్ష లక్ష్మి నమోస్తుతే

వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః
రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మ ద్విషోజహి

లక్ష్మీదేవి అనుగ్రహం వల్లనే వర్షం కురుస్తుందని శాస్త్ర వచనం. ఆ వర్షం కారణంగానే నేల మీద విత్తనాలు మొలకెత్తి సమస్త జీవులకు ఆహారం అందుతున్నది. అంతేకాదు, ఆ తల్లి మనలో జ్ఞాన బీజాన్ని మొలకెత్తించి విజ్ఞాన ఐశ్వర్యాన్ని సిద్ధింపజేస్తుంది. లక్ష్మీ కటాక్షం సంతోషాలకు మూలకారణం. అయితే, ఆ ఆనందాల్లోనే తేలిపోతూ మనలోని సద్గుణాలను విడిచిపెట్టిన క్షణం నుంచి పతనం మొదలవుతుంది. శ్రీదేవి కరుణను తాత్కాలికమైన లౌకిక సుఖాలకు పరిమితం చేయడం అజ్ఞానమే అవుతుంది. ఆపదలు తీరి అన్నిటా సంతోషం కలిగినప్పుడు విచక్షణ కోల్పోకుండా, వివేచనతో మెలగాలి. జ్ఞాన తృష్ణను తీర్చుకుంటూ ధార్మికతవైపు పయనించాలి. కలిగిన దాంట్లో నలుగురికీ సాయం చేస్తూ పునీతులం కావాలి. అప్పుడే లక్ష్మీ అనుగ్రహానికి సార్థకత ఏర్పడుతుంది. మోక్షానికి మార్గం సుగమం అవుతుంది.

జగమంతా లక్ష్మీ నివాసం

లక్ష్మీదేవి ప్రస్తావన మహాభారతం శాంతిపర్వంలో వస్తుంది. ‘లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది?’ అని భీష్ముడిని అడుగుతాడు ధర్మరాజు. దానికి జవాబుగా ‘జలాల్లో, పచ్చని పొలాల్లో, అగ్నిలో, వాయువులో, గోవులో, ఏనుగు కుంభస్థలంలో, ఇంటి గడపపై, ఇల్లాలి పాపిటబొట్టులో, నుదుటి సిందూరంలో, ఇంట్లోని వ్యక్తుల చిరునవ్వులో, అతిథి సత్కారాలు ఉన్న ఇంటిలో, స్వచ్ఛతలో, పరిశుభ్రతలో, బంగారంలో, చల్లని వెన్నెలలో, సత్యం, దానం, వ్రతం, ధర్మం ఆచరించే చోట లక్ష్మి నివసిస్తుంది’ అని చెప్పిన భీష్ముడి సమాధానం ద్వారా జగమంతా లక్ష్మీ నివాసమే అని అర్థమవుతుంది.

ఇక్కడ క్షణం ఉండదు

మన ఇంట్లో లక్ష్మి కొలువుదీరడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కానీ, చిన్న పొరపాటు చాలు అనంత లక్ష్మి అంతర్ధానమైపోతుంది. మనసులో అసూయ రగిలినా, లోభాన్ని ప్రదర్శించినా, అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు గురైనా ఆ ఇంట లక్ష్మి ఉండదు. ధర్మం తప్పిన చోట, తులసిని పూజించని చోట, శివార్చన జరగని ఇంట, అతిథి సత్కారాలు లేని నెలవు నుంచి లక్ష్మి వెళ్లిపోతుంది. ఇల్లాలు కంటతడి పెట్టినా, అసత్యాలు పలికినా, దుర్భాషలాడినా, ఇతరుల మనసు గాయపరిచిన వారి ఇంటి నుంచి సిరి తరలిపోతుంది. భాగవతులను నిందించే వాళ్లపై కనికరం చూపదు లక్ష్మీదేవి. పొద్దస్తమానం నిద్రపోయే సోమరులను, పని చేయడంలో అశ్రద్ధ వహించే బద్ధకస్తులను కన్నెత్తి చూడదు. కలహాలు పెట్టుకునే ఇంట్లో క్షణం నిలువదు.

పసిడి పంటల్లో ధాన్యలక్ష్మిగా..  పాలనలో రాజ్యలక్ష్మిగా.. లాలనలో గృహలక్ష్మిగా.. ఇంటింటా సంతానలక్ష్మిగా.. ఊరంతా మహాలక్ష్మిగా శోభిల్లుతుంది శ్రావణ వరలక్ష్మి. సేద్యం ఆమెదే. స్వేదం ఆమెనే. వేదన ఆమె కోసమే. శోధన ఆమె కోసమే. ఆ సిరి మహాలక్ష్మి మాత్రం తాను ఎక్కడుంటానో నిక్కచ్చిగా చెప్పింది. ముగ్గుళ్ల లోగిళ్లలో స్థిరంగా ఉంటానని సెలవిచ్చింది. మంచి మనుషులు, మనసులు ఉన్నచోట సదా కొలువై ఉంటానంది. శ్రావణ శోభతో లోకమంతా అలరారుతున్న ఈ శుభవేళ.. మహాలక్ష్మి కోరినట్టు మన ఇంటిని తీర్చిదిద్దుకుందాం. ఆ తల్లిని మన ఇంట ఉండమని వేడుకుందాం.

Leave A Reply

Your email address will not be published.