జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక హిందూ ఆలయాలపై దాడులు పెరిగాయి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ ఛార్జీ పాతూరి నాగభూషణం విమర్శలు గుప్పించారు.”జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక హిందూ ఆలయాలపై దాడులు పెరిగాయి. రాష్ట్రంలో మత మార్పిడులు బాగా జరుగుతున్నాయి. ఆలయాలపై దాడి, ధ్వంసం అంశాలలో బీజేపీ తరపున అనేకసార్లు పోరాటాలు చేశాం. అయినా జగన్ లో మాత్రం ఏమాత్రం చలనం లేదు. ఆలయాలపై దాడులు చేసిన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. జగన్ మార్కు టీటీడీ పాలక మండలి సభ్యుల ప్రకటన ఆశ్చర్యపరిచింది. ఒక ఉద్యోగానికి ఎన్నో అంశాలను పరిశీలించి నియమిస్తాం. కానీ తిరుమల వెంకన్న సేవకు అవినీతి పరులను నియమించడం ఎంతవరకు సబబు. శరత్ చంద్రా రెడ్డి మద్యం కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి. ఈ అంశాలపై మా అధ్యక్షురాలు పురంధేశ్వరి ట్వీట్ చేస్తే కొంతమంది వైసీపీ నేతలు ఏదేదో మాట్లాడతారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని పుస్తకాలు వేసిన వైసీపీ నేతలు ఈ నాలుగేళ్లల్లో చర్యలు ఎందుకు తీసుకోలేదు. పోలవరం విషయంలో జగన్ మాట తప్పి మడమ తిప్పారు. రైల్వే ప్రాజెక్టుకు ఎనిమిది వందల కోట్లు కట్టాల్సి ఉన్నా… జగన్ ఇవ్వలేదు. వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల అనేక ప్రాజెక్టులు వెనక్కి వెళ్లిపోయాయి. వైసీపీ నాయకులు ఆకాశ రామన్న ఉత్తరాలు రాయడం మాని.. నేరుగా మాతో చర్చించే దమ్ముందా. ఏపీ అభివృద్దికి కేంద్రం అన్ని విధాలా సహకరించి నిధులు ఇస్తుంది. జగన్ లోపాలను ఎత్తి చూపితే.. తల తోక లేకుండా మాట్లాడతారా. కేసులలో ఉన్న వారిని టీటీడీ బోర్డులో ఎలా పెట్టారు. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలతో ఆడుకుంటారా. పిచ్చిపిచ్చి మాటలు మానుకుని.. విధానపరమైన అంశాలపై చర్చించండి.” అని పాతూరి నాగభూషణం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.