భూమి కింద రెండంతస్తుల భవనం

.. 12 ఏళ్లు కష్టపడి నిర్మించిన వ్యక్తి

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఇష్టమైన ఇంటిని కట్టుకోవాలని చాలా మంది కలలు కంటారు. అందుకోసం ఎంతో కష్టపడి తమకు ఇష్టమైన విధంగా అందమైన ఇంటిని నిర్మించుకుంటారు. రాత్రనక, పగలనక కష్టపడి డబ్బులు సంపాదించుకుని ఇష్టమైన ఇంటి కోసం ఎంతైనా ఖర్చు పెట్టి అందంగా రూపొందించుకుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన డ్రీమ్ హౌస్‌ను కట్టుకునేందుకు 12 ఏళ్లు కష్టపడ్డాడు. అది కూడా ఎవరి సాయం లేకుండా ఒక్కడే నిర్మించుకున్నాడు. భూమిపైన కాకుండా భూమి లోపల 11 రూమ్‌లతో రెండు అంతస్థుల ఇళ్లు కట్టుకున్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా తన కలల ఇంటిని ఎట్టకేలకు పూర్తి చేశాడు. ఇది ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయీకి చెందిన ఇర్ఫాన్‌ అలియాస్‌ పప్పుబాబా అందరిలా కాకుండా డిఫరెంట్‌గా ఇల్లు నిర్మించుకున్నాడు. 12 ఏళ్లు కష్టపడి భూగర్భంలో రెండు అంతస్థుల ఇల్లు కట్టుకున్నాడు.పై నుంచి చూస్తే బంకర్‌లా కనిపించే ఆ ఇంటిని మట్టితో నిర్మించడం మరో విశేషం. ఆ మట్టిని కూడా ఇర్ఫాన్‌ తన సొంత పొలంలో నుంచి తీసుకువచ్చి కట్టుకోవడం గమనార్హం. భూమి లోపల విశాలంగా తన రెండు అంతస్థుల ఇంటిని నిర్మించాడు. ఎవరి సాయం లేకుండా ఒంటరిగానే 12 ఏళ్లు కష్టపడి ఆ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి ఇర్ఫాన్‌ భళా అనిపించుకున్నాడు.2010 లో ఇర్ఫాన్‌ తండ్రి చనిపోవడంతో అతనికి కష్టాలు ప్రారంభం అయ్యాయి. ఢిల్లీలో పనిచేసే ఇర్ఫాన్‌.. అప్పుడే ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన స్వగ్రామం అయిన హర్దోయికి వచ్చి స్థానిక ఎన్నికల్లో పోటీ చేశాడు. అయితే ఆ ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టి ప్రచారం చేసినా.. ఓటమి పాలయ్యాడు. దీంతో తండ్రిని కోల్పోవడం, ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇర్ఫాన్.. కొన్ని రోజులు నిరాశలో కూరుకుపోయాడు. అదే బాధతో మళ్లీ గ్రామం విడిచి వేరే రాష్ట్రానికి వలస వెళ్లాడు. అయితే తన డ్రీమ్ హౌస్‌ను కట్టుకోవాలని భావించి మళ్లీ హర్దోయి గ్రామంలో అడుగు పెట్టాడు.2011లో తన కలల ఇంటిని నిర్మించడం మొదలు పెట్టాడు. ఖుర్పా అనే చిన్న పార లాంటి వస్తువుతో ఇర్ఫాన్‌.. పూర్వ కాలంలో ఉండే విధంగా అండాకారంలో ఇంటి గోడలను చెక్కడం ప్రారంభించాడు. ఎవరు కూలీలు, మేస్త్రీలను పెట్టుకోకుండా ఒంటరిగానే ఇంటి నిర్మాణానికి సిద్ధమయ్యాడు. ఇంటిని నిర్మిస్తున్నన్ని రోజులు.. కేవలం తినడం, పడుకోవడానికి మాత్రమే తన ఇంటికి వెళ్లేవాడు. తన కుటుంబసభ్యులతో కూడా ఎక్కువ సమయం గడిపేవాడు కాదు.మొత్తానికి 12 ఏళ్లు కష్టపడి ఇటీవల తన సొంత కలల ఇంటిని పూర్తి చేసుకున్నాడు. అందులో 11 గదులతో రెండు అంతస్థుల భవనాన్ని నిర్మించాడు. కిచెన్, బెడ్‌రూమ్, బాత్‌రూమ్, పూజ గది, డ్రాయింగ్‌ రూమ్ సహా అన్ని సదుపాయాలు ఉండేలా ఇంటిని కట్టుకున్నాడు. ఇర్ఫాన్‌ కట్టిన ఇంటిని చూసి స్థానికులతోపాటు చుట్టుపక్కల గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వారందరూ ఇర్ఫాన్ నిర్మించిన డ్రీమ్ హౌస్‌ను చూసేందుకు ఎగబడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.