జీ 20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు డుమ్మా

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఢిల్లీలో జ‌ర‌గ‌నున్న జీ20 శిఖ‌రాగ్ర స‌మావేశాల‌కు చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ డుమ్మా కొట్టే అవ‌కాశాలు ఉన్నాయి. ఆయ‌న ఆ స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యే అవ‌కాశాలు లేవ‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ స్పందించారు. జిన్‌పింగ్ గైర్హాజ‌రు త‌న‌ను నిరాశ‌కు లోను చేస్తుంద‌న్నారు. ఢిల్లీలో జ‌రిగే స‌మావేశాల్లో పాల్గొనేందుకు 8వ తేదీన బైడెన్ ఇండియాకు రానున్నారు. అయితే ఆ స‌మావేశాల‌కు జిన్‌పింగ్ వ‌స్తార‌ని తొలుత ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆయ‌న త‌న ప్లాన్ మార్చుకున్న‌ట్లు కొన్ని మీడియా క‌థ‌నాలు ద్వారా తెలుస్తోంది. జిన్‌పింగ్ స్థానంలో ఆ దేశ ప్ర‌ధాని లీ కియాంగ్ త‌మ ప్ర‌తినిధుల బృందంతో హాజ‌ర‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని భావిస్తున్నారు.

 

ప్ర‌స్తుతం భార‌త్, చైనా మ‌ధ్య ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం ఉన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల చైనా రిలీజ్ చేసిన కొత్త మ్యాప్ ప‌ట్ల భార‌త్ ఆందోళ‌న వ్యక్తం చేసింది. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, అక్సాయ్ చిన్ ప్ర‌దేశాల‌ను త‌మ భూభాగంలో ఉన్న‌ట్లు చైనా త‌న మ్యాప్‌లో ప్ర‌చురించింది. దీన్ని భార‌త్ ఖండిస్తూ త‌న నిర‌స‌న‌ను వ్య‌క్తం చేసింది. ఈ నేప‌థ్యంలో రెండు దేశాల మ‌ధ్య మ‌ళ్లీ ప్ర‌చ్ఛ‌న్న వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. అందుకే జిన్‌పింగ్ జీ20 స‌మావేశాల కోసం ఇండియా రావ‌డం లేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

 

జిన్‌పింగ్ రాక‌పోవ‌డం నిరాశ‌కు గురి చేస్తుంద‌ని బైడెన్ అన్నారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. అయినా తాను జిన్‌పింగ్‌ను క‌లుసుకోనున్న‌ట్లు చెప్పారు. గ‌త ఏడాది ఇండోనేషియాలో ఇద్ద‌రూ భేటీ అయ్యారు. మ‌ళ్లీ ఆ నేత‌లిద్ద‌రూ న‌వంబ‌ర్‌లో జ‌రిగే అపెక్ స‌మావేశాల్లో పాల్గొనే ఛాన్సు ఉంది.

Leave A Reply

Your email address will not be published.