దామరంచలో అక్రమ వెంచర్ల ఏర్పాటు

.. నిబంధనలు గాలికి .. పంచాయతీ డోర్ నెంబర్లతో రిజిస్ట్రేషన్లు.

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్/ బీర్కూరు ప్రతినిధి:
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు తయారైంది కొంత మంది నాయకుల తీరు. ఎలాగూ తమ మాట చెల్లుతుందని నాలుగు రాళ్లు వెనకేసుకుందామని కొంతమంది అధికార పార్టీ నాయకులు రియల్ వ్యాపారులుగా అవతారం ఎత్తారు.. వివరాల్లోకి వెళితే బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూరు మండలం దామరంచ గ్రామ పంచాయతీ పరిధిలో గల ఒక రైస్ మిల్లు స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వెంచర్ ఏర్పాటుచేసి కొంత మంది అధికారపార్టీ నాయకులు గ్రామపంచాయతీ పాలకులు, అధికారులతో కుమ్మక్కై ఇంటి నంబర్ల వేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని ప్లాట్ల విక్రయాలకు తెరలేపారు. నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీ పరిధిలో 300 గజాల కంటే తక్కువ ఉంటేనే గ్రామ పంచాయతీ కార్యదర్శి అనుమతి ఇచ్చే అధికారం ఉంటుంది. దామరంచ గ్రామ శివారులోని వెంచర్ ప్రాంతం సుమారు 7000 గజాలు ఉండగా, సంబంధిత వ్యక్తులు జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిటిసిపి అప్రూవల్ తో గ్రామపంచాయతీకి మొత్తం స్థలంలో 10 శాతం కేటాయించి ఆ తర్వాత వెంచర్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కొంతమంది నాయకులు ఇవేమీ పట్టించుకోకుండా నిబంధనలను గాలికి వదిలేసి గ్రామపంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ప్లాట్లు చేసి ఇంటి నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేసి విక్రయాలకు పాల్పడ్డట్లు సమచారం. కేవలం అధికారం పెట్టుబడిగా అధికారులను సైతం బెదిరించి అక్రమంగా స్థలాన్ని ప్లాట్లుగా విభజించి పంచాయతీ రివిజన్ రిజిస్టర్ లో డిస్మాండిల్ హౌస్ పేరిట డోర్ నంబర్లు సృష్టించి ఖాళీ స్థలాన్ని చూపిస్తూ రిజిస్ట్రేషన్లు జరిపి విక్రయాలు చేపట్టి లక్షల రూపాయలు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది . ఈ వ్యవహారాన్ని తెరవ వెనక ఉండి బడా నాయకుల సహకారంతో నిర్వహించినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఈ అక్రమ వెంచర్ల ఏర్పాటు ప్లాట్ల విక్రయాలపై జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులు పూర్తి విచారణ జరిపి అక్రమార్కుల పై చర్యలు చేపట్టాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వెంచర్ ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. పంచాయితీ కార్యదర్శి సుజాత.. దామరంచ గ్రామ పరిధిలో అక్రమంగా వెలిసిన వెంచర్ అనుమతుల పై తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్ ప్రతినిది స్థానిక పంచాయితీ కార్యదర్శి సుజాతను వివరణ కోరగా వెంచర్ కు తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సమాధానం ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.