35 ఏళ్ల తర్వాత మరో కీలక ఘట్టం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: భాగ్య‌న‌గ‌రం చ‌రిత్ర‌లో 35 ఏండ్ల త‌ర్వాత కీల‌క ఘ‌ట్టం చోటు చేసుకోనుంది. ఇది పోలీసుల‌కు స‌వాలుతో కూడిన అంశం. ఎందుకంటే.. మూడున్న‌ర ద‌శాబ్దాల త‌ర్వాత మిలాద్ ఉన్ న‌బీ, గ‌ణేశ్ నిమ‌జ్జ‌నాలు ఒకే రోజు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో పోలీసులు భ‌ద్ర‌తాప‌రంగా తీసుకోవాల్సిన చ‌ర్య‌లు అత్యంత కీల‌కం. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌ల‌కు ఆస్కారం లేకుండా అసాధార‌ణ భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. భ‌ద్ర‌త‌కు సంబంధించిన హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ ఎప్ప‌టిక‌ప్పుడు ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలోని అన్ని జోన్ల పోలీసు అధికారుల‌తో ఆదివారం బంజారాహిల్స్ క‌మాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి సీవీ ఆనంద్ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. సున్నిత‌మైన ప‌రిస్థితుల దృష్ట్యా ఆరంచెల భ‌ద్ర‌తా ప్ర‌ణాళిక అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఆరంచెల భ‌ద్ర‌త‌తో పాటు రోడ్‌మ్యాప్‌ను సీవీ ఆనంద్ వివ‌రించారు.

మిలాద్ ఉన్ న‌బీ, గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం స‌జావుగా జ‌రిగేందుకు వ్యూహాత్మ‌క ప్రాంతాల్లో ఆక‌స్మికంగా వాహ‌నాలు త‌నిఖీలు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. సీనియ‌ర్ అధికారులు అసాంఘిక శ‌క్తుల్ని గుర్తించేందుకు త‌నిఖీల్లో పాల్గొనాల‌ని సూచించారు. ఫ్లాగ్ మార్చ్‌లు, సామాజిక మాధ్య‌మాల్లో విద్వేష పోస్టుల‌పై దృష్టి సారించాల‌ని ఆదేశించారు. ఈ స‌మావేశంలో అద‌న‌పు క‌మిష‌న‌ర్లు విక్ర‌మ్ సింగ్ మాన్, విశ్వ‌ప్ర‌సాద్, జాయింట్ క‌మిష‌న‌ర్ ప‌రిమ‌ళ హన నూత‌న్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.