జీ-20 సదస్సు- పర్యావరణ దార్శనికత 

 -డాక్టర్ భారత రవీందర్ -సైన్స్ రచయిత & ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జీ-20 ( గ్రూప్ ఆఫ్ ట్వంటీ ) దేశాల కూటమి 18వ శిఖరాగ్ర సమావేశం భారత్ అధ్యక్షతన ఈ నెల 9-10 తేదీలలో భారత్ మండపం ప్రగతిమైదాన్న్యూడిల్లీలోజరిగింది. మనకు స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాల అనంతరం ఒక శక్తివంతమైన అంతర్జాతీయ కూటమికి మనదేశం అధ్యక్షత వహించడం గొప్ప విశేషం . జీ-20 ప్రసిడెన్సీ భారతదేశం యొక్క అమృత్ కాలము ( 2022-2047) ప్రారంభాన్ని కూడా తెలియజేస్తున్నది . 1990 చివరలో తూర్పు ఆసియా మరియు ఆగ్నేయాసియా దేశాలలో తలెత్తిన  ఆర్థికసంక్షోభం నేపధ్యంలో పరస్పర ఆర్థికసహకారం కొరకు 19 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కలిసి   1999 లో జీ-20 దేశాల కూటమిఏర్పడింది.కాలక్రమంలో ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఎజెండా  అంశాలలో మార్పులు చోటుచేసుకున్నాయి . గత సంవత్సరం 17వ జీ-20 దేశాల సదస్సు బాలి ( ఇండోనేషియా ) లో రికవర్ టుగెదర్–రికవర్ స్ట్రాంగర్ అనే నినాదంతో  జరిగింది .ఈ సంవత్సరం మన ప్రాచీన సంస్కృతగ్రంధమైన మహాఉపనిషత్తుల నుండి గ్రహించబడిన “ వసుదైక కుటుంబం “ ( గ్లోబల్ ఫ్యామిలీ ) అనే తాత్వికఆలోచనను రూపొందించడానికి వన్ఎర్త్ , వన్ ఫ్యామిలీ , వన్ ఫ్యూచర్ అనే ప్రధాన ఇతివృత్తంతో జీ-20 సమావేశం విజయవంతమైంది . ప్రపంచ ఐక్యతాసందేశాన్ని అందించే ఈ ఇతివృత్తం పరిపూర్ణమైనది .  ఈ థీమ్ మానవ  జంతు  వృక్ష సూక్ష్మజీవుల విలువలను మరియు భూమితో సహ విశ్వవ్యాప్తంగా వాటి పరస్పర అనుసందానాన్ని తెలియజేస్తున్నది . వచ్చే సంవత్సరం (2024) లో 19వ జీ -20 దేశాల సదస్సు  రియోడిజనిరో ( బ్రెజిల్ ) లో జరుగనుంది . ప్రతి సంవత్సరం ఒక సభ్యదేశం అధ్యక్షతన జరిగే జీ-20 దేశాలసమావేశాలు తమ ఎజెండాలో ఆర్థికాంశాలతో పాటు పలు పర్యావరణపరిరక్షణ , వాతావరణమార్పు అంశాలకు పెద్దపీట వేస్తుండటం ఆహ్వానించదగిన పరిణామంగా చెప్పుకోవాలి .

 జీ-20 పర్యావరణమంత్రాంగం:ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన జీ-20 దేశాలు జనాభాలో మూడింట రెండు వంతుల , ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం , ప్రపంచ జీడీపీలో 85 శాతం వాటా కలిగి ఉన్నాయి . 21 వ శతాబ్దపు ప్రపంచ సవాళ్ళతో పాటు పర్యావరణసవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని  పరిష్కారమార్గాలను కనుగొనేందుకు జీ-20 సమావేశాలు నిరంతరం  కృషి సలుపుతునే ఉన్నాయి . 2022వ సంవత్సరం ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ-20 సమావేశం 2015 నాటి పారిస్ ఒప్పందాన్ని అమలుచేయాలని పునరుద్ధ్ఘాటించింది . ఈ శతాబ్దం చివరినాటికి ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల రేటు 1.5 సెల్సియస్ డిగ్రీలకు పరిమితం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు ఆ సదస్సు ప్రకటించింది . కోవిడ్ -19 నివారణ , సంసిద్దత , ప్రతిస్పందనల కోసం వరల్డ్ బ్యాంక్ ప్రారంభించిన పాండమిక్ ఫండ్ అనే కొత్త ఆర్థిక మధ్యవర్తినిధిని కూటమి స్వాగతించింది . ఈ సంవత్సరం ( 2023 )  మనదేశంలో జరిగిన జీ-20 శిఖరాగ్రసమావేశాల్లో * హరిత అభివృద్ది , వాతావరణ ఆర్థికనిధి , లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ( లైఫ్ ) * సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధనపై పురోగతిని వేగవంతం చేయడం * వేగవంతమైన నిలుపుదల గల స్థితిస్థాపకవృద్ది * సాంకేతిక పరివర్తన మరియు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్* 21వశతాబ్దానికి బాహుపాక్షికసంస్థలు–మహిళల నేతృత్వంలో అభివృద్ది అను 6 ప్రాధాన్యతాంశాలు ఎజెండాఅంశాలుగా ఉన్నాయి . ఇందులో భాగంగా గడిచిన  సంవత్సరకాలంగా అధికారులుదౌత్యవేత్తలు వ్యాపారవేత్తలు ఎన్‌జి‌ఓలు  వర్కింగ్ గ్రూపులు మరియు మంత్రుల స్థాయిలో 60 నగరాల్లో  జరిగిన 220 లకు పైగా సన్నాహక సమావేశాలను ఆత్మీయఆతిథ్యములో ఫలవంతమైన చర్చలతో ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశనం చేయడంలో భారత్ ముందుంది .  పర్యావరణ పరిరక్షణ గురించి  మే  21-23 తేదీలలో ముంబై లో జరిగిన జీ-20 దేశాల  ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ సస్టేనబిలిటీ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో నీలి ఆర్థిక వ్యవస్థ , సముద్రవనరుల పరిరక్షణ మరియు సముద్ర జీవవైవిధ్యంల సుస్థిర నిర్వహణ అంశాల గురించి చర్చించారు .జూన్ 16-17 తేదీలలో హైదరాబాద్ లో జరిగిన వ్యవసాయ మంత్రుల సమావేశంలో ఆహారభద్రత, పౌష్టికాహారం గురించి చర్చించారు . 26-28 జులై లో చెన్నైలో జరిగిన జీ-20 దేశాల పర్యావరణ మంత్రుల సమావేశంలో భూమిక్షీణత నివారణ , జీవవైవిధ్యపెంపు, ఆవరణపునరుద్దరణ , వాతావరణసుస్థిరత , నీలి మరియు వృత్తాకార ఆర్థికవ్యవస్థలు  తదితర అంశాల గురించి విస్తృతంగా  చర్చలు జరిగాయి .

న్యూడిల్లీలో ఈ నెల 9-10 తేదీలలో జరిగిన  18 వ శిఖరాగ్రసమావేశంలో  ఎజెండా అంశాల గురించి విస్తృతంగా చర్చించి విధాన కార్యాచరణ నిర్ణయాలను ఏకగ్రీవంగా ఆమోదించి 37 పేజీలు ,  87 పేరాలు గల న్యూడిల్లీడిక్లరేషన్ను  ఆవిష్కరించారు .డిల్లీ డిక్లరేషన్ అనేది ప్రపంచ దేశాల భవిష్యత్ కోసం , మరింత స్థిరమైన సమానమైన సంపన్నమైన ప్రపంచాన్ని నిర్మించడానికి అన్నీ దేశాలు కలిసి పనిచేయడానికి ఒక ఉమ్మడి పిలుపు .భూగోళ పర్యావరణ పరిరక్షణ దిశగా “ భూమి-ప్రజలు–శాంతి–శ్రేయస్సు “ ( ప్లానేట్, పీపుల్ , పీస్ , ప్రాస్పరిటీ – పి4 )  అనే శీర్షికతో 8 పేరాలలో   జియోపొలిటికల్ అంశాలు ఉన్నాయి . ఈ అన్నీ అంశాలపై సదస్సు ఏకాభిప్రాయాన్ని వెలిబుచ్చింది .  ప్రపంచ దేశాలన్నీ  2030 నాటికి గ్రీన్  హౌజ్వాయువుల ఉద్ఘారాలను 43 శాతం తగ్గించడానికి కట్టుబడి ఉండాలని , భూతాపం కట్టడికి 5.8-5.9 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లు అవసరమని , 2050 నాటికి శూన్య నికరకర్బన ఉద్ఘారాలను సాధించే దిశగా పనిచేయాలని , క్లీన్ఎనర్జీ టెక్నాలజీ  కొరకు ప్రతి సంవత్సరం 4 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లు అవసరమని డిక్లరేషన్ స్పష్టం చేసింది . ప్రపంచవ్యాప్తంగా సుస్థిరమైన జీవఇంధనాల వినియోగాన్ని పెంచడానికి గ్లోబల్ బయోఫ్యూయెల్ అలయెన్స్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది . పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ కలపాలని తద్వారా కర్బన ఉద్ఘారాలను తగ్గించవచ్చునని , కృత్రిమమేధ వల్ల తలెత్తే రిస్క్ లను నివారించేందుకు దేశాలన్నీ ప్రొ ఇన్నోవేషన్ రెగ్యులేషన్ గవర్నెన్స్ విధానాన్ని అవలంభించాలని జీ 20 దేశాలు తమ డిక్లరేషన్ లో నిర్ణయించాయి . సుస్థిర భవిష్యత్తు కొరకు హరిత ఒప్పందంను స్వాగతించింది .  భూమి దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం ప్రకృతితో సామరస్య జీవనం కోసం , స్వచ్చమైన పచ్చదనంతో కూడిన మరియు నీలిరంగు భవిష్యత్తును సాధించే లక్ష్యంతో గ్లాస్గో సదస్సు (2021) లో మనదేశం   “  పర్యావరణం కోసం  జీవనశైలి “(Lifestyle ForEnvironment –LiFE) అనే ప్రపంచస్థాయి పర్యావరణ ప్రజాఉద్యమ ఆలోచనకు  అంకురార్పణ చేయడం  మరియు ఈ ప్రోగ్రామ్ లక్ష్యాల కార్యాచరణ సాధనకు జీ-20 సదస్సులో ఎజెండా అంశంగా  చేర్చడం అనేది ప్రపంచ పర్యావరణరంగంలో కీలకమలుపుగా పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు .

వాతావరణన్యాయంతో మేలు  : నేడు ప్రపంచం వాతావరణవిపత్తుల వైపు పరిగెడుతోంది . కనుక పర్యావరణ వ్యవస్థలు , జీవవైవిధ్యం నాశనం అవుతున్నందున ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు . ప్రజాశ్రేయస్సు దృష్ట్యా పర్యావరణ సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధనలో మనమిప్పుడు మధ్యకాలంలో ఉన్నాం . ఈ లక్ష్యాల ప్రగతిని వేగిరవంతం చేయడంపై జీ-20 కూటమి సమావేశం యొక్క న్యూడిల్లీ డిక్లరేషన్ కార్యాచరణ ప్రాణాళిక  అన్నీ దేశాలను ఉజ్జ్వల భవిష్యత్తు వైపు పయనింపజేస్తుందని చెప్పడంలో సందేహం లేదు . ఈ కార్యాచరణకనుగుణంగా జీ-20 దేశాలు పలు వాతావరణసంరక్షణ చర్యలను చేపట్టాలి . పర్యావరణం , వాతావరణం పరిశీలన కోసం భారత్ ప్రతిపాదించిన జీ-20 శాటిలైట్ మిషన్ ప్రారంభానికి సత్వర చర్యలు తీసుకోవాలి .   ఆహారం , ఇంధన నిర్వహణ , సైబర్ భద్రత , భవిష్యత్ తరాల ఆరోగ్యం , నీటి భద్రత సమస్యలకు గట్టి పరిష్కారాన్ని కనుగొనాలి . 2030 నాటికి భూభాగం , సముద్రాలలో కనీసం 30 శాతాన్ని పూర్తి స్థాయిలో పరిరక్షించేందుకు 30 బై 30 ప్రణాళికను అమలు పరచాలి .ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందించాలి . 21 వ శతాబ్దపు వాతావరణ సవాళ్లను దృష్టిలో పెట్టుకొని  సమ్మిళిత శక్తి పరివర్తన కోసం అభివృద్ది  చెందిన దేశాలు పాటుపడాలి .  వాతావరణ మార్పుల దుష్ప్రభావంతో ఎక్కువ నష్టపోయే పేద బలహీన దేశాల ప్రజలకు తగు చేయూత నిచ్చేవిధంగా అత్యధిక కర్బన ఉద్ఘారిత సంపన్న దేశాలు సత్వరంగా వాతావరణ ఆర్థికనిధిని ఏర్పాటు చేసి  వారికి తగు వాతావరణ న్యాయం ( క్లైమేట్ జస్టిస్ ) జరిగేలా జీ-20 దేశాలు మరింత పర్యావరణ దార్శనికత కలిగి  నిబద్దతతో మెరుగైన భవిష్యత్తు కోసం  కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది .

 

– వ్యాసరచయిత : డాక్టర్ భారత రవీందర్  ( 9912536316 )

Leave A Reply

Your email address will not be published.