ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌వితకు సుప్రీంకోర్టులో ఊర‌ట

- ఈ నెల 26 వ‌ర‌కు స‌మ‌న్లు జారీ చేయొద్ద‌ని ఈడీని ఆదేశించిన  సుప్రీంకోర్టు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌వితకు సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఎమ్మెల్సీ క‌విత‌కు ఈ నెల 26వ తేదీ వ‌ర‌కు స‌మ‌న్లు జారీ చేయొద్ద‌ని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది. న‌ళినీ చిదంబ‌రం త‌ర‌హాలోనే త‌మ‌కూ ఊర‌ట క‌ల్పించాల‌ని కోర్టును క‌విత కోరారు. క‌విత పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం ఈడీ న్యాయ‌వాది స్పంద‌న కోరింది. త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ కోర్టుకు తెలిపారు. ఈ నేప‌థ్యంలో సెప్టెంబ‌ర్ 26వ తేదీ వ‌ర‌కు స‌మ‌న్లు జారీ చేయొద్ద‌ని జ‌స్టిస్ కౌల్ ధ‌ర్మాస‌నం ఆదేశించింది.ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి నోటీసులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. శుక్రవారం విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఈడీ పేర్కొంది. దర్యాప్తు సంస్థలు మహిళలను ఇంటివద్దే విచారించాలని, సమయపాలన పాటించాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ ఇంకా కొనసాగుతున్నది. ఈడీ ముందు కవిత ఇప్పటికే మూడుసార్లు హాజరై విచారణ ఎదుర్కొన్నారు. ఆమెకు వ్యతిరేకంగా ఇంతవరకు ఎటువంటి ఆధారాలను చూపలేకపోయినా మరోసారి నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 17న కేంద్ర మంత్రి అమిత్‌షా రాష్ర్టానికి వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆయనకు వేరే ఇతర అంశాలు లేకపోవడంతో ఈడీ ముందు కవిత హాజరును ఒక అస్త్రంగా మార్చుకొనేందుకే ఆమెకు నోటీసులు ఇప్పించినట్టు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా ఇవి పొలిటికల్‌ నోటీసులని, పెద్దగా పట్టించుకోనవసరం లేదని తేలికగా తీసిపారేశారు.

Leave A Reply

Your email address will not be published.