కేరళ లో 6 కు పెరిగిన నిఫా వైరస్ కేసులు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: అత్యంత ప్రమాదకరమైన నిఫా వైరస్‌ కేరళ రాష్ట్రంలో మరోసారి విజృంభిస్తోంది. ఈ వైరస్‌ అంతకంతకూ వ్యాప్తి చెందుతోంది. తాజాగా కోజికోడ్‌ జిల్లాకు చెందిన 39 ఏళ్ల వ్యక్తికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ శుక్రవారం ఉదయం వెల్లడించారు. ప్రస్తుతం వైరస్‌ సోకిన వ్యక్తిని ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా, తాజా కేసుతో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆరుకు పెరిగింది. అయితే అందులో నిఫా కారణంగా బుధవారం ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు పాజిటివ్‌ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.ఈ వైరస్‌ అంతకంతకూ వ్యాప్తి చెందుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నిఫా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న కోజికోడ్‌ జిల్లా వ్యాప్తంగా హైఅలర్ట్‌ జారీ చేసింది. జిల్లాలోని 7 గ్రామాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. ముందు జాగ్రత్తగా అక్కడి బ్యాంకులు, పాఠశాలలను, ఇతర కార్యాలయాలకు రెండు రోజులపాటు సెలవు ప్రకటించారు. కాగా, ప్రస్తుతం వెలుగు చూసిన నిఫా వైరస్‌ బంగ్లాదేశ్‌ వేరియంట్‌ అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపించగలదని తెలిపింది. వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ మరణాల రేటు అధికమని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీనాజార్జ్‌ తెలిపారు.మెదడును అత్యంత తీవ్రంగా దెబ్బతీసే నిఫా వైరస్‌ను 1999లో తొలిసారి గుర్తించారు. మలేసియా, సింగపూర్‌లోని పందుల పెంపకందారుల్లో ఈ ఇన్‌ఫెక్షన్‌ బయటపడింది. ఇక దక్షిణ భారతదేశంలో తొలిసారి నిఫా వైరస్‌ కేసు మే 19, 2018లో కోజికోడ్‌ జిల్లాలోనే వెలుగుచూసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఈ వైరస్‌ నాలుగుసార్లు వ్యాప్తిలోకి వచ్చింది. ఈ వైరస్‌ కారణంగా 2018, 2021లో మరణాలు నమోదయ్యాయి. మొత్తం 23 మందికి ఈ వైరస్‌ నిర్ధారణ కాగా, అందులో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.

Leave A Reply

Your email address will not be published.