కొత్త సీసాలో పాత సార మహిళా బిల్లు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఎన్నాళ్లుగానో శీతల గిడ్డంగిలో పడున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్రం చిత్తశుద్ధి సందేహాస్పదంగానే ఉన్నది. చట్టసభల్లో మహిళ లకు 33 శాతం రిజర్వేషన్లు ఇప్పట్లో సాధ్యం కావని అనిపిస్తున్నది. అమలు కాని, ఆచరణలో సాధ్యం కాని మహిళా బిల్లు కోసం ప్రత్యేక సమావేశాలు, అందునా కొత్త సభావేదిక సాక్షిగా తొలి బిల్లు ప్రవేశపెట్టి అపహాస్యం చేశారనిపిస్తుంది. మహిళా బిల్లు వెనుక అనేక పోరాటాలు, ఆందోళనల నేపథ్యం ఉన్నా ఉభయ సభల ఆమోదం, కేంద్ర ప్రభుత్వ ప్రకటన అనంతరం మేధావులు, ప్రజాప్రతినిధులు, బుద్ధిజీవులు బీజేపీ సర్కారు చిత్తశుద్ధిని అనుమానించాల్సిన పరిస్థితి ఉన్నది. అందుకే ఈ బిల్లు కాలయాపన బిల్లే తప్ప మరోటి కాదనిపిస్తున్నది.చిత్తశుద్ధి కొరవడి చేసే ఏ కార్యక్రమమైనా ఆచరణలో ఆశించిన ఫలితాలనివ్వదని చరిత్రలో అనేకసార్లు నిరూపితమైంది. చట్టసభల్లో ఆ బిల్లు పాసైందనే సంబరం కంటే ఆ బిల్లు ఆచరణ సాధ్యం కాదని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న తీరు చూస్తుంటే ఈ తతంగమంతా దేనికని అనిపించక మానదు. గతంలో కాంగ్రెస్‌ రాజ్యసభలో మహిళా బిల్లు ప్రవేశపెట్టి తాత్సారం చేసినట్టే ఇప్పుడు బీజేపీ కూడా కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగా మళ్లీ అదే బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టి యావత్‌ మహిళలోకాన్ని బురిడీ కొట్టించిందా? మహిళా బిల్లును ఆచరణాత్మకంగా అమలు చేయాలనుకున్నప్పుడు 2029లో అమలు చేస్తామని చెప్పడం కాలయాపన కాదా? మహిళా బిల్లు అమలు పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని బీజేపీ ఉభయ సభల సాక్షిగా విమర్శలు గుప్పించినా ఆ పార్టీ కూడా తక్షణం అమలుకు అంతగా ఆసక్తి కనబరచకపోవడం విడ్డూరమే. అంటే కాంగ్రెస్‌ చేసిన పనే బీజేపీ చేస్తున్నది. డీలిమిటేషన్‌, ఓబీసీ రిజర్వేషన్లు, కులగణన ఇత్యాది అంశాల సాకు చెబుతున్నప్పుడు, మరి పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ ముందుగా ఆ బిల్లును ఎందుకు చేపట్టలేకపోయింది. ఎన్నికల ముందే ఎందుకు తెచ్చారు? ఒకవేళ మహిళా రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు తక్షణం అమలు చేయడం లేదన్నది చర్చించాల్సిన అంశం. ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, నూతన పార్లమెంట్‌ భవనంలో తొలి బిల్లు ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వం తీరు మహిళా బిల్లు విషయంలో ఓ స్త్రీ రేపు రా అనే సామెతనే గుర్తు చేస్తున్నది. బీజేపీకి నిజంగా బిల్లుపై ఆసక్తి ఉంటే పైలట్‌ ప్రాజెక్టుగానైనా ఈ దఫా ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో అమలు చేయాల్సి ఉండింది. డీలిమిటేషన్‌, బీసీ గర్జన, కులగణన అడ్డంకులుగా ఉన్నవని భావిస్తే ఉన్నపళంగా ప్రత్యేక సమావేశంలో మహిళా బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్న ఉదయిస్తున్నది. కులమత సహిత సమాజంలో అణచివేతకు గురై ఎదుగుదలకు నోచుకోని కులాల మహిళలకు ప్రత్యేక అవకాశాలు కల్పించగలిగే రీతిలో ప్రయత్నాలుండాలి. ముంజేతి కంకణానికి అద్దం అవసరం లేదు. వెనుకబడిన తరగతులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం మెరుగవ్వాలనే ఆలోచన ఇప్పటి తక్షణావసరం. ఇందుకోసం జనాభాలెక్కల్లో భాగంగా బీసీ జనగణనను చేపట్టాలి. స్థానిక సంస్థల ఎన్నికలకోసం నిర్దేశించిన వివరాలను దామాషాగా తీసుకొని చట్టసభల్లో అమలు చేయొచ్చు.

Leave A Reply

Your email address will not be published.