అక్టోబర్ 1న తెలంగాణకు ప్రధాని మోడీ రాక

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: అక్టోబర్ 1, 3వ తేదీన తెలంగాణ పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన హైదరాబాద్, కాచిగూడ వద్ద మీడియాతో మాట్లాడుతూ విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటుందని, బాగ్యనగరంలో రద్దీని తగ్గించుకునేందుకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మిస్తున్నామని, దీనిని ఈ ఏడాది చివరిలో ప్రధాని మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. వరంగల్‌లో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభం చేసుకున్నామని తెలిపారు.గత ప్రభుత్వాలు తెలంగాణలో రైల్వే విస్తరణలో అన్యాయం చేశాయని, మోదీ హయాంలో తెలంగాణకు నూతన రైల్వే లైన్ల నిర్మాణంకు సర్వేలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఉత్తర తెలంగాణ నుంచి డిల్లీకి కలిపేలా నూతన రైల్వే లైన్‌లు రాబోతున్నాయన్నారు. ప్రజలు కూడా రైల్వేలను తమ ప్రయాణం కోసం వినియోగించుకోవాలని సూచించారు. వందే భారత్ రైల్లు విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం రూ. 20 వేల కోట్లు కేటాయించిందని, దానిచుట్టూ రైల్వే లైన్ నిర్మాణంకు, రైల్ రింగ్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పిందన్నారు. నగరం అనేక రంగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, రవాణా రంగం అభివృద్ధి చెందితే నగరంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఇప్పటి వరకు 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని కిషన్ రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.