వయనాడ్‌ నుంచి కాకుండా హైదరాబాద్‌ నుంచి పోటీ చేయాలి

రాహుల్ గాంధీ కి ఏఐఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సవాల్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్ గాంధీ కి ఏఐఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఓ ఛాలెంజ్‌ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ.. వయనాడ్‌ నుంచి కాకుండా హైదరాబాద్‌ నుంచి పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేశారని ఆరోపించారు. ‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మీ నాయకుడు (రాహుల్ గాంధీ) వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని నేను సవాల్ విసురుతున్నాను. మీరు పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇస్తూనే (కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి) ఉన్నారు. క్షేత్రస్థాయికి వచ్చి నాపై పోరాడండి’ అని అన్నారు.ఈ నెల ఆరంభంలో తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, ఏఐఎంఐఎం పార్టీలు ఐక్యంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఈ కూటమికి వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడుతోందన్నారు. ‘తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ కు వ్యతిరేకంగా మాత్రమే కాకుండా.. బీజేపీ, ఎంఐఎంతో పోరాడుతోంది. వారు తమను తాము వేర్వేరు పార్టీలుగా చెప్పుకుంటారు. కానీ, వారంతా ఐక్యంగానే పనిచేస్తున్నారు’ అంటూ రాహుల్‌ వ్యాఖ్యానించారు. రాహుల్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఒవైసీ తాజాగా పై విధంగా స్పందించారు.

Leave A Reply

Your email address will not be published.