ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణ పతకం సాధించిన ఇండియా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆసియా క్రీడల్లో రెండో రోజును భారత్‌ ఘనంగా ప్రారంభించింది. మొదటి రోజు ఐదు పతకాలను ఖాతాలో వేసుకున్న ఇండియా‌.. నేడు తొలి స్వర్ణ పతకం సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ విభాగంలో టీమ్‌ఇండియా గోల్డ్‌ మెడల్‌ను ముద్దాడింది. రుద్రాంక్ష్‌ బాలాసాహెబ్ పాటిల్‌, ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌, దివ్యాన్ష్‌ సింగ్‌ పన్వర్‌తో కూడిన భారత జట్టు ఫైనల్‌లో 1893.7 పాయిట్లు నమోదుచేసి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. దీంతో బాకు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చైనా నెలకొల్పిన 1893.3 పాయింట్ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. కాగా, మూడు రజత పతకాలు, రెండు కాంస్య పతకాలతో పతకాల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న భారత్‌.. ఈ స్వర్ణంతో ఆరో ప్లేస్‌కు చేరింది. 1890.1 పాయింట్లతో దక్షిణ కొరియా రజతం, 1888.2 పాయింట్లతో చైనా కాంస్య పతకాలు గెలుపొందాయి.ఈ ముగ్గురు అథ్లెట్లు వ్యక్తిగతంగానూ ఫైనల్‌కు చేరుకోవడం గమనార్హం. ఫైనల్‌ కోసం జరిగిన పోటీల్లో రుద్రాంక్ష్‌ మూడో స్థానంలో నిలువగా, తోమర్‌, దివ్యాన్ష్‌ ఐదు, ఎనిమిదో ప్లేసుల్లో నిలిచి టాప్‌-8లో ప్లేసు సంపాదించారు. అయితే ఏషియన్‌ గేమ్స్‌ నియమాల ప్రకారం ఒక దేశం నుంచి ఇద్దరు మాత్రమే ఫైనల్‌కు చేరుకుంటారు. దీంతో రుద్రాంక్ష్‌ పాటిల్‌, ఐశ్వరీ ఫైనల్‌కు అర్హత సాధించారు.

Leave A Reply

Your email address will not be published.