జడ్జిల పేర్లు తొక్కి పెట్టడం పై ధర్మాసనం ఆగ్రహం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: జడ్జీల నియామకాలు, బదిలీల విషయంలో కేంద్రానికి, సుప్రీంకోర్టుకు మధ్య మరోసారి వివాదం నెలకొన్నది. హైకోర్టులు సిఫారసు చేసిన పేర్లను కొలీజియంకు పంపకుండా పెండింగ్‌లో పెట్టినందుకు జస్టిస్‌ సంజయ్‌కిషన్‌ కౌల్‌ తీవ్రస్థాయిలో కేంద్రంపై మండిపడ్డారు. ‘చెప్పడానికి చాలా ఉంది. కానీ నన్ను నేను అదుపు చేసుకుంటున్నాను. అటార్నీ జనరల్‌ ఒకవారం గడువు కోరారు కాబట్టి ప్రస్తుతానికి మౌనం వహిస్తున్నాను. కానీ తదుపరి విచారణ సమయంలో మాత్రం మౌనంగా ఉండను’ అని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి న్యాయవ్యవస్థకు, కార్యనిర్వాహక వర్గానికి మధ్య ప్రతిష్ఠంభన నెలకొంటున్నది. జడ్జీల నియామకాల విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన పేర్లను కేంద్రం తొక్కిపెట్టడం వివాదానికి కారణమవుతున్నది.తాజాగా.. హైకోర్టులు పంపిన సిఫారసులను కేంద్రం కొలీజియంకు ఎందుకు పంపలేదని సుప్రీంకోర్టు నిలదీసింది. జడ్జీల పేర్లను ఆమోదించడంలో కేంద్రం జాప్యం చేస్తున్నదంటూ దాఖలైన ఓ పిటిషన్‌పై మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సుధాంశు ధూలియాతో కూడిన ధర్మాసనం కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘హైకోర్టుల నుంచి వచ్చిన 70 మంది పేర్లు 10 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఒకే ఒక్క ప్రాథమిక ప్రక్రియను అనుసరించాలి. మీరు మీ అభిప్రాయం చెప్తే కొలీజియం ఒక నిర్ణయం తీసుకుంటుంది’ అని జస్టిస్‌ కౌల్‌ కేంద్రాన్ని ఉద్దేశించి అన్నారు. ‘కీలకమైన ఓ హైకోర్టు’కు చీఫ్‌ జస్టిస్‌ నియామకం, 26 మంది జడ్జీల బదిలీలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ‘హైకోర్టులు సిఫారసు చేసినప్పటికీ పెండింగ్‌లో ఉన్నవి, కొలీజియం దృష్టికి రాని పేర్లకు సంబంధించిన సమాచారం నా వద్ద ఉన్నది’ అని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.