చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ అక్టోబర్ 3 కు వాయిదా

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కుంభకోణం కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణను అక్టోబర్ మూడో తేదీకి వాయిదా వేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద గవర్నర్ అనుమతి తీసుకోకుండా తనపై ఏపీ సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టులో ఎస్ఎల్‌పీ దాఖలు చేశారు. అంతకుముందు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ గత శుక్రవారం హైకోర్టు జస్టిస్ కే శ్రీనివాసరెడ్డి తీర్పు ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ శనివారం సుప్రీంకోర్టులో ఎస్ఎల్‌పీ దాఖలు చేశారు.తొలుత చంద్రబాబు పిటిషన్‌పై విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు జస్టిస్ ఎస్వీఎన్ భట్టి విముఖత ప్రదర్శించారు. దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ వద్ద చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లుథ్రా ప్రస్తావించారు. తక్షణం కేసు లిస్టింగ్ చేయాలని కోరారు. చంద్రబాబు బెయిల్ కోరుకుంటున్నారా? అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించినప్పుడు.. తాము బెయిల్ కోరుకోవడం లేదని లుథ్రా అన్నారు.‘చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను త్వరితగతిన కేసు లిస్టింగ్ చేయాలని మా తొలి అభ్యర్థన. మధ్యంతర రిలీఫ్ కల్పించాలని రెండో అప్పీల్. అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ సెక్షన్ అంటే కేసు మూలాలపై చర్చించాల్సిన అంశం. ఎఫ్ఐఆర్ ప్రకారం చంద్రబాబును కస్టడీలో పెట్టదగిన కేసు కాదు. మేం బెయిల్ కోరుకోవడం లేదు’ అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు సిద్ధార్థ లుథ్రా తెలిపారు.‘దిగువ కోర్టు న్యాయమూర్తిని సంయమనం పాటించాలని చెప్పలేం. జడ్ క్యాటగిరీ, ఎన్ఎస్‌జీ సెక్యూరిటీ గల వ్యక్తిని ఇలా ట్రీట్ చేస్తారా.. ఇది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛతో కూడిన అంశం. యశ్వంత్ సిన్హా కేసులో వ్యక్తి స్వేచ్ఛపై అన్ని విషయాలు చేర్చారు. కానీ ఈ కేసులో చంద్రబాబును కస్టడీకి అప్పగించాలని ఏపీ సీఐడీ పోలీసులు కోరుతున్నారు. దాని నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాం’ అని లుథ్రా వాదించారు.

Leave A Reply

Your email address will not be published.