టీఎస్‌ ఆర్టీసీలో వీఆర్ఎస్‌ దరఖాస్తుల పరిశీలన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీఎస్ ఆర్టీసీలో వీఆర్ఎస్‌కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులందర్నీ స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతించనుంది సంస్థ. జూలై 31 వరకు వచ్చిన దరఖాస్తులు చేసుకున్న వారితో పాటు కొత్తగా చేసుకునే దరఖాస్తులను పరిశీలించి వీఆర్‌ఎస్‌కు అనుమతించాలని ఆర్టీసీ యాజమాన్యం అధికారులను ఆదేశించింది. వీఆర్‌ఎస్‌ దరఖాస్తులను స్వీకరించి అర్హులందరికీ అవకాశం కల్పించాలని ఆర్టీసీ యాజమాన్యం డిపో మేనేజర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాదు ఇక నుంచి వీఆర్‌ఎస్‌ను నిరంతరప్రక్రియగా పరిగణించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.

వీఆర్ఎస్‌కు లైన్ క్లియర్ ..

వీఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు ప్రత్యేక ప్యాకేజీ లేకపోవడంతో ఇప్పటి వరకు అమలులో ఉన్న నిబంధనల మేరకే వీఆర్ఎస్‌పై వెళ్లే వారికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించనుంది ఆర్టీసీ యాజమాన్యం.నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించేందుకు ఎన్నో ఆఫర్లు ప్రకటిస్తూ పురోగాభివృద్ధి సాధిస్తోంది. అలాగే ఆర్టీసీలో చేపడుతున్న నూతన సంస్కరణల్లో భాగంగానే వయోభారం, అనారోగ్యంతో విధులు నిర్వహించలేకపోతున్న డ్రైవర్లు, కండక్టర్లను వీఆర్‌ఎస్‌ అనుమతించడం ద్వారా వేతనాల భారం తగ్గుతుందని ఆర్టీసీ అధికారులు భావించారు. అందులో భాగంగానే ఈనిర్ణయం తీసుకున్నారు. ఇక మూడు నెలల్లో కారుణ్య నియామకాలను కూడా భర్తీ చేయాలని యాజమాన్యం చూస్తోంది.

 

ప్రయోజనాలను బట్టి నిర్ణయం..

టీఎస్ ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇచ్చినట్టుగా వీఆర్‌ఎస్‌ ప్యాకేజీ ఇస్తే ఆర్టీసీలో పని భారం తట్టుకోలేకపోతున్న మరికొంత మంది సైతం వీఆర్ఎస్‌ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. 55 ఏళ్లు పైబడిన ఉద్యోగులు రోజూ ఏకధాటిగా పది గంటల పాటు సిటీ బస్సులు నడుపలేక నరకయాతన అనుభవిస్తున్నారని..అలాంటి వాళ్ల సంఖ్య దాదాపు 10వేల మంది వరకు ఉంటారని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.