గంగమ్మ ఒడికి చేరిన గౌరీ తనయుడు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఖైరతాబాద్ శ్రీ ద‌శ మ‌హా విద్యాగ‌ణ‌ప‌తి నిమజ్జనం కార్యక్రమం పూర్తయింది. నవరాత్రుల పాటు భక్తుల ప్రత్యేక పూజలందుకున్న గౌరీ తనయుడు గంగమ్మ ఒడికి చేరాడు. 63 అడుగుల ఎత్తు, 40 ట‌న్నుల బ‌రువున్న ఈ విగ్ర‌హ నిమ‌జ్జ‌నానికి భ‌క్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడి నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ‌కు ఇసుకెస్తే రాల‌నంత జ‌నం వ‌చ్చి.. బైబై వినాయ‌కా అంటూ వీడ్కోలు ప‌లికారు. మహాగణపతి శోభయాత్ర ఖైరతాబాద్‌ నుంచి టెలిఫోన్‌ భవన్‌ మీదుగా డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర స‌చివాల‌యం ముందు నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు సాగింది. ఇక్కడ చివరిసారిగా నిర్వాహకులు మహాగణపతికి పూజలు నిర్వహించారు.అనంతరం నాలుగో నంబర్‌ క్రేన్‌ ద్వారా మహాగణపతిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. వినాయకుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం ఖైరతాబాద్‌లో శోభాయాత్ర ప్రారంభం కాగా.. మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు కొనసాగింది. మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల స‌మ‌యంలో ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడు గంగ‌మ్మ ఒడికి చేరాడు. నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర కొనసాగే మార్గాలలో ట్రాఫిక్‌ మళ్లించారు. ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Leave A Reply

Your email address will not be published.