బైడెన్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికల వేడి మొదలైంది. రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మెట్ల దారిని సరిగా గుర్తించలేరంటూ ఎద్దేవా చేశారు.అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మతిపరుపు, తడబాట్ల కారణంగా నిత్యం విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే. ఏదో ఒక పొరపాటు చేస్తూ మీడియాకు చిక్కుతున్నారు. తన పర్యటనలు, ఇతర సందర్భాల్లో విమానం ఎక్కుతూ అనేకసార్లు మెట్లపై కింద పడిపోయారు. మెట్లపైనే కాదు ఇటీవలే కొలరాడోలో అమెరికా వైమానిక దళ అకాడమీ లో జరిగిన గ్రాడ్యుయేషన్‌ వేడుకల్లోనూబైడెన్‌ ఒక్కసారిగా కాలు స్లిప్‌ అయ్యి కిందపడిపోయారు. ఈ నేపథ్యంలోనే మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు బైడెన్‌ సిద్ధమవుతున్న వేళ వీటిని ఉద్దేశించి ట్రంప్‌ విమర్శలు చేశారు.‘అతను మెట్ల దారిని సరిగా గుర్తించలేరు. వేదికపైకి రాలేరు. ఈ స్టేజ్‌ చూడండి ఎంత చెత్తగా ఉందో. అయినా కుడి, ఎడమ వైపు మెట్లను నేను బాగా గుర్తించగలను. అయితే, ఆ వ్యక్తి మాత్రం పైకి లేచి నిలబడి నేను ఎక్కడున్నాను..? అని ప్రశ్నిస్తారు’ అంటూ బైడెన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ట్రంప్‌ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.ఈ ఏడాది జులైలో లుథియానాలో జరిగిన నాటో సదస్సు లో పాల్గొన్న బైడెన్ మైకు ముందు టంగ్ స్లిప్ అయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ పేరును పలకబోయి.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ అని సంబోధించబోయారు. అయితే వెంటనే తన పొరపాటును గుర్తించిన అధ్యక్షుడు ఆ తర్వాత సరైన మాట పలికారు. అయితే, ఆ సమయంలో బైడెన్ పక్కనే జెలెన్ స్కీ కూడా ఉండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. బైడెన్ అలా నోరు జారడం మొదటిసారి కాదు. కెమెరా సాక్షిగా ఎన్నో సార్లు తప్పిదాలు చేసి విమర్శల పాలయ్యారు. ఉక్రెయిన్ ప్రజలు అనబోయి.. ఇరాన్ ప్రజలు అని మాట్లాడారు. అలా పలు సందర్భాల్లో తన మతిమరుపు కారణంగా టంగ్ స్లిప్ అయ్యి విమర్శల పాలయ్యారు. ఇక, విదేశీ పర్యటకు వెళ్లిన సమయంలో కూడా బైడెన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ఎక్కుతూ మెట్లపై జారిపడ్డ సందర్భాలూ అనేకం. చాలా సందర్భాల్లో అధ్యక్షుడు కింద పడి వార్తల్లో నిలిచారు.

Leave A Reply

Your email address will not be published.