పోటికి బిజెపి అధిష్టానం ఆదేశాలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: నగరంలో ప్రతిష్టాత్మకమైన అంబర్‌పేట నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లోని కేంద్ర మంత్రులు, ఎంపీలు అసెంబ్లీకి పోటీ చేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించిన నేపథ్యంలో ఆయన అంబర్‌పేట నుంచి పోటీ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొన్నటివరకు ఆయన అసెంబ్లీకి పోటీ చేయడానికి అంత ఆసక్తి చూపలేదు. అయితే పార్టీ ఆదేశాలతో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అంబర్‌పేట నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. కిషన్‌రెడ్డి 2004లో పూర్వ హిమాయత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో హిమాయత్‌నగర్‌ నియోజకవర్గం రద్దయి అంబర్‌పేట నియోజకవర్గం కొత్తగా ఆవిర్భవించింది. 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో ఈ అంబర్‌పేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నాలుగో సారి 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్‌ఎస్‌ అఽభ్యర్థి కాలేరు వెంకటేష్‌ చేతిలో వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. కాగా, ఐదోసారి అసెంబ్లీ బరిలో దిగాలని కిషన్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. గెలిస్తే ఎమ్మెల్యేగా ఓడిపోతే మళ్లీ ఎంపీగా పోటీ చేయాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం.

 

ఒకవేళ కిషన్‌రెడ్డి అంబర్‌పేట స్థానం నుంచి పోటీ చేయకపోతే టికెట్‌ ఎవరిని వరిస్తుందోనన్న చర్చ సైతం నియోజకవర్గంలో ముమ్మరంగా సాగుతోంది. అయితే ఇక్కడి నుంచి టికెట్‌ కోసం మరో నలుగురు నేతలు టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందులో మాజీ అధ్యక్షుడు బి. వెంకట్‌రెడ్డి, ఆయన సతీమణి బాగ్‌అంబర్‌పేట కార్పొరేటర్‌ పద్మవెంకట్‌రెడ్డిలు ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మిగతా ముగ్గురిలో బీజేపీ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.గౌతంరావు, ఉపాధ్యక్షుడు వనం రమేశ్‌, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు కె.గీతామూర్తి ఉన్నారు. వీరిలో బాగ్‌అంబర్‌పేట డివిజన్‌కు చెందిన గౌతంరావు, వెలమ సామాజిక వర్గానికి చెందినవారు కాగా, కాచిగూడ డివిజన్‌కు చెందిన కె. గీతామూర్తి బ్రాహ్మణ సామాజిక వర్గం, నల్లకుంట డివిజన్‌కు చెందిన మాజీ కార్పొరేటర్‌ వనం రమేశ్‌ బీసీ పద్మశాలి కులానికిచెందిన వారు కావడం గమనార్హం. అయితే బీఆర్‌ఎ్‌సకు ఇటీవల రాజీనామా చేసిన మాజీ మంత్రి సి.కృష్ణ యాదవ్‌ శనివారం బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈయన కూడా అంబర్‌పేట టికెట్‌ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కిషన్‌రెడ్డి ఒకవేళ అంబర్‌పేట నుంచి పోటీ చేయకపోతే ఈ నలుగురిలో ఎవరిని టికెట్‌ వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.