గూగుల్ రివ్యూ పేరుతో ఆన్ లైన్ మోసం

.. జాగ్రత్త సుమా

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: దినదినాభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని కొంతమంది దుండగులు తమకు అవకాశం గా మల్చుకొని అక్రమంగా సంపాదించుకునేందుకు కొత్త తరహా దారులను వెతుక్కుంటున్నారు. వివరాల్లోకి వెళితే ఇప్పటివరకు లింకుల ద్వారా స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసి కీలకమైన సమాచారాలను ఫోన్లో నుండి సేకరించి వారి అకౌంట్లో నుండి ఓటీపీల సహాయంతో డబ్బులు మాయం చేయడం చాలా ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు కొత్త తరహాలో గూగుల్ రివ్యూ పేరిట హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీ వారం అంటూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపిస్తామంటూ వాట్సాప్ టెలిగ్రామ్ ప్లాట్ఫామ్తో 50 నుండి 100 రూపాయలు ఒక్కో రివ్యూ కి చెల్లిస్తూ అధిక మొత్తంలో వారితో డబ్బులు పెట్టుబడి పెట్టించి మోసాలకు పాల్పడుతున్నారు.

ఈ మధ్యకాలంలో కామారెడ్డి లో ఓ యువకుడు వీరి వలలో చిక్కి సుమారు మూడు లక్షల రూపాయల వరకు మోసపోయినట్లు సమాచారం. ముందుగా వారు కొంతమందిని ఎంపిక చేసుకొని మేము హెచ్సీఎల్ గూగుల్ రివ్యూ కంపెనీ నుండి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాము మీరు చేయాల్సిందల్లా కేవలం మీ స్మార్ట్ ఫోన్లో తాము ఇచ్చిన టాస్క్ని రివ్యూ సబ్మిట్ చేసి మాకు స్క్రీన్ షాట్స్ పెడితే ఒక్కో స్క్రీన్ షాట్ కు 50 నుంచి 100 రూపాయలు చెల్లిస్తామంటూ ముందు పరిచయం చేసుకుంటారు. తర్వాత వారికి ఒక్కో రివ్యూకు 50 రూపాయలు వెనువెంటనే చెల్లిస్తూ తరువాత వారిని ఓ లింకు ద్వారా టెలిగ్రామ్ సమూహంలో చేర్చి సుమారు 100, 150 మందితో గ్రూపును ఏర్పాటు చేసి మీరు ఇప్పుడు త్వరితగతిన డబ్బులు సంపాదించాలనుకుంటే మేము అందించే టాస్కులు పూర్తి చేసి మా కంపెనీలో మీరు నగదు జమ చేసినట్లయితే సుమారు 50 వేలకు 15000 రూపాయలు అదనంగా కేవలం పది నిమిషాల వ్యవధిలో మీ అకౌంట్లో వేస్తామని టెలిగ్రామ్ చాటింగ్ ద్వారా తెలియజేస్తారు. ఇది చూసే ప్రతి ఒక్కరు ఇది నిజమే అనుకునే విధంగా వారు యువకులను తప్పుదోవ పట్టిస్తారు. ఆ గ్రూపులో సుమారు 50 మంది వారి అనుకూలమైన వ్యక్తులే ఉండి ఒక్కొక్కరు 30,000 50,000 డబ్బులు డిపాజిట్ చేసి వెనువెంటే లబ్ధి పొందినట్లు తమ అకౌంట్ స్క్రీన్షాట్లను గ్రూప్లో షేర్ చేస్తారు .దీంతో ఇది చూసిన యువకులు ఆశ్చర్యానికి గురై వెంటనే వారి అకౌంట్ కి డబ్బులు పంపడం జరుగుతుంది. తదనంతరం ఆ గ్రూపు ఉండదు వారి ఎలాంటి సమాచారం ఫోన్లో కనబడదు అంతేకాకుండా యువకుల ఫోన్లు సైతం హాక్ అయిపోతాయి చివరికి తిరిగి చూస్తే వారు మోసపోయామని తెలుస్తుంది.ఏది ఏమైనప్పటికీ సైబర్ సెల్ పోలీసులు ఈ వ్యవహారాలపై ఓ కన్నేసి ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.