తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా 80 ఏండ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటు

తెలంగాణా జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా 80 ఏండ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటు వేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ వెల్ల‌డించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌న్నాహ‌కాల‌పై స‌మీక్ష కోసం రాష్ట్రానికి వ‌చ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప‌ర్య‌ట‌న గురువారంతో ముగిసింది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ ఇత‌ర క‌మిష‌న‌ర్ల‌తో క‌లిసి హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ‌లో స్త్రీ, పురుష ఓట‌ర్లు దాదాపు స‌మానంగా ఉండ‌టం శుభ ప‌రిణామం అని పేర్కొన్నారు. యువ ఓట‌ర్ల సంఖ్య 8 ల‌క్ష‌లు దాట‌డం ప్ర‌శంసించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. 2022-23 ఏడాదిలో 22 ల‌క్ష‌ల‌కు పైగా ఓట్ల‌ను ప‌రిశీలించి తొల‌గించిన‌ట్లు తెలిపారు. ఏక‌ప‌క్షంగా ఓట్ల‌ను తొల‌గించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఫామ్ అందిన త‌ర్వాతే ఓట్ల‌ను తొల‌గించిన‌ట్లు పేర్కొన్నారు. జులై త‌ర్వాత ద‌ర‌ఖాస్తు చేసుకున్న 2.21 ల‌క్ష‌ల యువ‌త‌కు ఓటు హ‌క్కు క‌ల్పించామ‌న్నారు. 66 నియోజ‌క‌వ‌ర్గాల్లో పురుషుల కంటే మ‌హిళా ఓట‌ర్లే అధికంగా ఉన్నారు. 18 నుంచి 19 ఏండ్ల యువ మ‌హిళా ఓట‌ర్లు 3.45 ల‌క్ష‌లు ఉన్నార‌ని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ స్టేష‌న్లు 35,356 ఉండ‌గా, ఒక్కో పోలింగ్ స్టేష‌న్లో స‌గ‌టు ఓట‌ర్ల సంఖ్య 897గా ఉంద‌న్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌న్న‌ద్ధ‌త‌లో భాగంగా అన్ని పార్టీల ప్ర‌తినిధుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించామ‌ని ఆయ‌న తెలిపారు. ఆయా పార్టీల సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను స్వీక‌రించామ‌న్నారు. ఎన్నిక‌ల ఖ‌ర్చు పెంచాల‌ని కొంద‌రు అడిగార‌ని చెప్పారు. ఫిర్యాదుల స్వీక‌ర‌ణ కోసం సీ విజిల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని రాజీవ్ కుమార్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.