బాంబుల వర్షంతో దద్దరిల్లిన సిరియా-100 మందికిపైగా మృతి

తెలంగాణా జ్యోతి/వెబ్ న్యూస్: బాంబుల వర్షంతో సిరియా దద్దరిల్లింది. హోమ్స్‌ ప్రావిన్స్‌ లోని మిలటరీ అకాడమీ పై డ్రోన్ల దాడి జరిగింది. ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 125 మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గురువారం హోమ్స్‌ ప్రావిన్స్‌లో సైనిక కళాశాల స్నాతకోత్సవం జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో మిలటరీ సిబ్బంది సహా వారి కుటుంబ సభ్యులు, సాధారణ పౌరులు కూడా ఉన్నారు.కార్యక్రమంలో ఆదేశ రక్షణ మంత్రి కూడా పాల్గొన్నారు. అయితే ఆయన వెళ్లిపోయిన కొద్ది నిమిషాల్లోనే ఈ దాడి జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మిలటరీ అకాడమీని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగినట్లు సిరియా మిలటరీ పేర్కొన్నట్లు పేర్కొంది. కార్యక్రమం ముగింపు సమయంలో ఆ ప్రాంతంలో డ్రోన్లు బాంబులను జారవిడిచాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా భయంకరంగా మారిపోయింది. ఎక్కడ చూసినా రక్తం మడుగుల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయి కనిపిస్తున్నాయి. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఘటనలో గాయపడిన వారిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించారు.కాగా, సిరియాలో గత 12 ఏళ్లుగా అంతర్యుద్ధం జరుగుతున్నప్పటికీ డ్రోన్లతో బాంబు దాడులు చేయడం గతంలో ఎన్నడూ చోటుచేసుకోలేదు. సాయుధ డ్రోన్లు రంగ ప్రవేశం చేయడంతో ఆందోళన నెలకొంది. ఇవి ఎక్కడ నుంచి వచ్చాయన్నది ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు ఇప్పటి వరకూ ఎవరూ బాధ్యత వహించలేదు.

Leave A Reply

Your email address will not be published.