పెద్దలు జానారెడ్డికి ఏఐసీసీ కీలక బాధ్యతలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో టీ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు రెడీ అయింది. అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపి జాబితాను ఓ కొలిక్కి తెచ్చింది. అయినా.. కొన్ని సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. టికెట్ కోసం ఆశావహులు ఢిల్లీతో పాటు హైదరాబాద్‌లోని గాంధీభవన్ ముందు ఆందోళనలకు దిగుతున్నారు. నాగర్ కర్నూల్‌లో నాగం జనార్ధన్ రెడ్డికే టికెట్ కేటాయించాలంటూ మంగళవారం గాంధీ భవన్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు టీపీసీసీ రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు. దానికి తోడు టికెట్ల విషయమై సీనియర్ల మధ్య కూడా పొరపచ్చాలు వచ్చినట్లు తెలిసింది.ఈ నేపథ్యంలో ఏఐసీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ సీట్ల సర్ధుబాటు, అసంతృప్త నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీనియర్ నేత జానారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన నేతృత్వంలో ఫోర్‌మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. టికెట్ దక్కని ఆశావహులు, అసంతృప్తి నేతలను బుజ్జగించే బాధ్యతలను హైకమాండ్ ఈ ఫోర్ మెన్ కమిటీకి అప్పగించింది. రబుల్‌ షూటర్‌గా జానారెడ్డికి కీలక బాధ్యతలు కట్టబెట్టింది. జానారెడ్డితోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, దీపా దాస్ మున్షి, మీనాక్షి నటరాజన్‌లతో ఈ కమిటీని నియమించింది.ఇవాళ గాంధీభవన్‌లో జానారెడ్డి అధ్యక్షతన సమావేశమై అసంతృప్తులు ఉన్న నియోజకవర్గాలపై కమిటీ సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన తరువాత అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించినట్లు తెలుస్తోంది. టికెట్ ఆశావహులు, అసంతృప్తి నేతలను బుజ్జగించకుండా సీట్లు ప్రకటిస్తే నేతల్లో అసంతృప్తి పెరిగి ఎన్నికల్లో పార్టీకి డ్యామేజ్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో అభ్యర్థుల ప్రకటన ముందే జానారెడ్డి ద్వారా అసంతృప్తి చల్లార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.