ఆధార్ తరహా లోనే ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డులు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ‘ఆధార్‌’ తరహాలో దేశంలోని ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ‘వన్‌ నేషన్‌-వన్‌ స్టూడెంట్‌ కార్డు’ తెచ్చే యోచనలో కేంద్ర విద్యా శాఖ ఉన్నది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఇచ్చే ఈ గుర్తింపు నంబర్‌ను ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ(ఏపీఏఏఆర్‌-అపార్‌)గా పిలువనున్నారు. అపార్‌ ఐడీ కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని అన్ని రాష్ర్టాలు, యూటీలను కేంద్ర విద్యా శాఖ తాజాగా ఆదేశించింది.

 

అపార్‌ ఐడీ అంటే ఏమిటీ?

 

అపార్‌ నంబర్‌ను విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు అపార్‌ ఐడీ ఇవ్వనున్నారు. దీనిలో విద్యార్థి అకడమిక్‌ జర్నీ, చరిత్ర(విద్యా ప్రయాణం), విజయాలు నిక్షిప్తం అవుతాయని, అవసరమైన సమయంలో ట్రాక్‌ చేయొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

 

క్యూఆర్‌ కోడ్‌ మాదిరిగా అపార్‌

 

విద్యార్థులకు కొత్త అపార్‌ గుర్తింపు కార్డుల జారీకి సంబంధించి తల్లిదండ్రులతో మాట్లాడాలని, అందుకు వారి సమ్మతి తీసుకోవాలని కేంద్రం అన్ని పాఠశాలలను కోరింది. అపార్‌ ఐడీ ప్రాముఖ్యతను వివరించేందుకు అక్టోబర్‌ 16-18 మధ్య తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించాలని సూచిం చింది. విద్యార్థికి అపార్‌ ఐడీ జారీకి సమ్మతి తెలిపిన తల్లిదండ్రులు.. ఏ సమయంలోనైనా దాన్ని ఉపసంహరించుకోవచ్చు.విద్యార్థుల డాటా రహస్యంగా ఉంటుందని, ప్రభుత్వ ఏజెన్సీలతో మాత్రమే పంచుకోవడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొన్నట్టు తెలిపింది. ‘వన్‌ నేషన్‌-వన్‌ స్టూడెంట్‌ ఐడీ’ స్కీమ్‌పై ఏఐసీటీఈ చైర్మన్‌ టీజీ సీతారామన్‌ మాట్లాడుతూ ఆపార్‌, నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేమ్‌ వర్క్‌ దేశంలోని విద్యార్థులకు క్యూఆర్‌ కోడ్‌ మాదిరిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థి నేర్చుకొన్న ప్రతి నైపుణ్యం, సాధించిన విజయం అందులో జమ అవుతుందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.