ఈనెల 28న యాదాద్రి ఆలయం మూసివేత

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: ఈనెల 28న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆరోజు చంద్ర గ్రహణం ఉన్న నేపథ్యంలో ఆలయాన్ని మూసి వేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 28న సాయంత్రం నాలుగు గంటల నుంచి 29వ తేదీ ఉదయం ఐదు గంటలకు వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో ప్రకటించారు. చంద్ర గ్రహణానికి ముందు రోజు అంటే 27న రాత్రి 7 గంటలకు శరత్‌ పౌర్ణమి వేడుకలను బ్రహ్మోత్సవ కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.చంద్ర గ్రహణం సందర్భంగా 28న సాయంత్రం 4 గంటలకు ఆలయాన్ని మూసివేసి.. తిరిగి 29వ తేదీ వేకుజామున ఐదు గంటలకు తెరిచి సంప్రోక్షణ చేయనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నందింగల్ లక్ష్మీనరసింహచార్యులు వెల్లడించారు. ప్రధానాలయంతో పాటు అనుబంధ ఆలయాలైన శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం, పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను కూడ మూసివేయనున్నట్లు చెప్పారు. అశ్వయుజ మాసం పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం సంభవిస్తుందని, ఈ నెల 28న అర్ధరాత్రి 1.06 గంటలకు ప్రారంభమై.. 2.22 గంటల వరకు గ్రహణం ఉంటుందని తెలిపారు. గంట 16 నిమిషాల పాటు గ్రహణ సమయం ఉంటుందని.. దీన్ని అంశిక చంద్ర గ్రహణంగా పిలుస్తారని ప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహచార్యులు తెలిపారు.చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయం కూడా మూతపడనుంది. ఈనెల 28న రాత్రి 7 గంటలకు ఆలయం మూసేసి మరుసటి రోజు ఆలయాన్ని తెరి సంప్రోక్షణ చేయనున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు. అలాగే విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం ఆలయాలు కూడా మూసివేయనున్నట్లు చెప్పారు.

 

 

Leave A Reply

Your email address will not be published.