తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జుక్కల్‌ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి

-  కాళేశ్వరం నీళ్లతో నిజాంసాగర్‌ను నింపుతున్నం  - ఇక నుంచి ఎప్పుడూ నిండుకుండలా నిజాంసాగర్‌ ప్రాజెక్టు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కరువు కాటకాలతో అల్లాడిన జుక్కల్‌ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని సీఎం కేసీఆర్‌ అన్నారు. జుక్కల్‌ నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. జుక్కల్‌ నియోజకవర్గానికి లెండి ప్రాజెక్టు రావాల్సి ఉన్నదని, ఎన్నికల తర్వాత మహారాష్ట్ర వాళ్లతో మాట్లాడి లెండి ప్రాజెక్టు సంగతి తేలుస్తానని సీఎం హామీ ఇచ్చారు. నాగమడుగు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ను షిండే పట్టుబట్టి సాంక్షన్‌ చేయించుకున్నారని, దాని ద్వారా వచ్చే వర్షా కాలానికి జుక్కల్‌లో 40 వేల ఎకరాలకు సాగు నీళ్లు వస్తయని చెప్పారు.

అంతేగాక.. ‘ఇక నుంచి నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఎప్పుడూ నిండుకుండలా ఉంటది. కాళేశ్వరం నీళ్లతో నిజాంసాగర్‌ను నింపుతున్నం. ఇక్కడి కరువును చూసి ఒకప్పుడు జుక్కల్‌కు పిల్లను ఇవ్వాలంటే భయపడేవారు. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 24 గంటల కరెంటు, సాగు నీటి వసతుల వృద్ధి కారణంగా నియోజకవర్గంలో సాగు విస్తీర్ణం పెరిగింది. దేశంలో దళిత బంధు పథకాన్ని సృష్టించిందే బీఆర్‌ఎస్‌ సర్కారు. దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నం. రైతులు స్వయం ఉపాధితో తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఈ పథకం తోడ్పాటును అందిస్తున్నం’ అని సీఎం తెలిపారు.

అదేవిధంగా.. ‘ జుక్కల్‌ నియోజకవర్గంలో 25 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నం. ఇప్పుడు తండాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయి. నియోజకవర్గంలో కొత్తగా మూడు మండలాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎన్నికల తర్వాత ఆ పని కూడా పూర్తి చేస్తం. జుక్కల్‌లో ఒక పీజీ కాలేజీని, మదునూరులో డిగ్రీలో కాలేజీని ఏర్పాటు చేశాం. నియోజకవర్గంలో ఇంకా కొన్ని కాలేజీలు కావాల్సిన అవసరం ఉందని హనుమంత్‌ షిండే అడిగారు. తప్పకుండా ఆ డిమాండ్‌ను నెరవేరుస్తా. బిచ్కుంద‌లో డ‌యాల‌సిస్ కేంద్రం పెట్టుకున్నం. అంతేగాక 100 ప‌డ‌క‌ల ఆస్పత్రికి ఈ మ‌ధ్యనే శంకుస్థాప‌న చేసుకున్నం. ఇకపై అన్ని హంగులు స‌మ‌కూర్చి ముందుకు పోతాం’ అని సీఎం హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.