నీతి నిజాయితీగా ఉన్న వారిని ఎన్నికల్లో గెలిపించుకోండి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు తిరుమల శ్రీవారి దర్శానానికి వెళ్తూ.. రేణిగుంట ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వెంకన్న ఆదాయం గురించి ప్రస్తావన తెచ్చారు. అంతేకాదు.. ప్రజలకు పలు సూచనలు, సలహాలు కూడా చేశారు…

 ‘ నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్న వారిని ఎన్నికల్లో గెలిపించుకోండి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి. అవినీతి అక్రమాలకు పాల్పడని వారిని ఎన్నుకోండి. కులానికి ధనానికి కాకుండా వ్యక్తి యొక్క గుణానికి ఓటు వేయండి. తాత్కాలిక ప్రలోభాలకు ఎవరూ లోను కాకండి.. అలా లోనైతే ఐదేళ్లు పాటు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దేవుని సొమ్మును టీటీడీ హిందూ ధార్మిక సంస్థలకు వినియోగించాలి. పురాతన దేవాలయాల పునరుద్ధనకు స్వామి వారి ఆదాయాన్ని ఖర్చు చేయండి’ అని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. రాజకీయాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా నేతలకు, ప్రజలకు, యువతకు వెంకయ్య కీలక సూచనలు, సలహాలు చేస్తూ వస్తున్నారు. అంతేకాదు.. అస్తమానూ పార్టీలు మారే నేతలకు కూడా పరోక్షంగా గట్టిగానే చురకలు కూడా అంటిస్తున్నారు.

ఆ మధ్య.. హైదరాబాద్‌లో నిర్వహించిన సిటిజన్‌ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరై.. ఓ వ్యక్తి పార్టీ మారితే ఆ పార్టీలో ఉన్నప్పుడు వచ్చిన పదవికి కూడా రాజీనామా చేయాల్సిన అవకాశం ఉందన్నారు. పార్టీల ఫిరాయింపులు, ఓట్ల కోసం నోట్లు ఖర్చుపెట్టటం లాంటి అంశాలపై మాట్లాడారు. యువత రాజకీయాల్లోకి రావాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. రాజకీయాల్లోకి రావాలంటే.. బ్యా‌గ్రౌండ్‌ అవసరం లేదన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తే.. రాజకీయాల్లో రాణించగలుగుతామని చెప్పుకొచ్చారు. కోట్లు లేకపోతే ఓట్లు రావన్న పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో ఏర్పడిందన్నారు. భుజం మీద కండువా మార్చినంత ఈజీగా నేతలు పార్టీలు మారుతున్నారని చెప్పుకొచ్చారు.

Leave A Reply

Your email address will not be published.