మేడిగడ్డ బ్యారేజీ పై భారీ కేడ్ల ఏర్పాటు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంపై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక సంచలనమైంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ ప్లానింగ్‌, డిజైన్‌, నాణ్యత, నిర్వహణ లోపాల కారణంగా కుంగిందని జాతీయ డ్యాం సేప్టీ అథారిటీ పేర్కొంది.మేడిగడ్డ బ్యారేజీ వద్ద కొత్తగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. బ్యారేజీ ఏడో బ్లాక్‌ 20వ పియర్‌ కుంగిపోయి దెబ్బతినడంతో సరిహద్దులో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య అక్టోబరు 21వ తేదీ నుంచి రాకపోకలను నిలిపేసిన సంగతి విదితమే. బ్యారేజీ పరిసరాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. బ్యారేజీ వైపు ఎవరూ వెళ్లకుండా అధికారులు, సంస్థ ప్రతినిధులు ఆ దారిని మూసివేశారు. అధికారులు, సిబ్బందిని మాత్రమే రాకపోకలకు అనుమతిస్తున్నారు. మరోవైపు ఏడో బ్లాక్‌ పరిధిలో పనులు కొనసాగుతున్నాయి. నీటిని మళ్లించినా ఎగువ ప్రాంతం నుంచి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి 26,350 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 61 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నదిలో కాఫర్‌ డ్యాం పనులు సాగుతున్నాయి.మరోవైపు మేడిగడ్డ పర్యటనకు రాజకీయ పార్టీలు వరుసగా వస్తుండటంతో ఎలాంటి ఉద్రిక్తత చోటుచేసుకోకుండా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ బ్యారేజీని పరిశీలించగా, తాజాగా బిజెపి నేతలు బ్యారేజీని సందర్శించేందుకు సిద్ధమయ్యారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, రాజ్యసభ ఎంపి డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌ శనివారం బ్యారేజీని హెలికాప్టర్‌లో పరిశీలించే అవకాశం ఉంది. మేడిగడ్డతో పాటు అన్నారం (సరస్వతి) బ్యారేజీని కూడా సందర్శించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.