బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం

కాంగ్రెస్‌ పార్టీ 50 ఏళ్ల పాలనలో ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదు   కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని సీఎం కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 50 ఏళ్ల పాలనలో ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదని, పైగా ఉన్న రాష్ట్రాన్ని ఊడగొట్టి సర్వ నాశనం చేసిందని సీఎం మండిపడ్డారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కూడా బరిలో దిగుతున్న సీఎం.. నామినేషన్‌ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రానికి చేసిన నష్టాన్ని ఓటర్లకు వివరించారు. మరోసారి కాంగ్రెస్‌ పార్టీ మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణతి రాలేదు. ఏయే దేశాల్లో ఆ పరణతి వచ్చిందో ఆ దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నయ్‌. ఎన్నికలు వచ్చినప్పుడు గుడ్డిగ ఓటు వేయొద్దు. పోటీలో ఉన్న వ్యక్తి ఎటువంటోడు..? ఆ వ్యక్తి వెనుక ఉన్న పార్టీ ఎటువంటింది..? అని ఆలోచించి ఓటు వేయాలి. ఆషామాషీగా ఓటు వేస్తే ఐదు సంవత్సరాల్లో మన తలరాత అధ్వాన్నంగ మారిపోతది. ఆలోచించి ఓటేసినప్పుడే నాయకులు కాకుండా ప్రజలు గెలుస్తారు. అలాంటి పరిణతి మనదేశంలో రావాలని నేను కోరుకుంటున్న’ అని చెప్పారు.‘బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటం కోసం. ఇదంతా మీకు తెలిసిన కథ. కాంగ్రెస్‌ పార్టీ 50 ఏళ్లు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించింది. ఒకప్పుడు తెలంగాణ మనది మనకు ఉండె. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే ఈ కాంగ్రెస్‌ పార్టీ. జబర్‌దస్త్‌గ తెలంగాణను తీస్కపోయి ఆంధ్రాతో కలిపిండ్రు. ఆ దెబ్బతో 58 ఏళ్లు మనం గోసపడ్డం. ఈ 58 ఏళ్ల కాలంలో మనకు సాగునీళ్లు లేవు. తాగునీళ్లు లేవు. పంటలు లేవు. కరువు కాటకాలు. రైతుల ఆత్మహత్యలు. ఇన్నింటికి కారణం ఎవరు..? కాంగ్రెస్‌ పార్టీ కాదా..? ఆ పార్టీకి ప్రజల ఓట్లు కావాలె. కానీ ప్రజల బాగోగులు పట్టవు. జవహర్‌లాల్‌ నెహ్రూ కాలం నుంచి గూడా కాంగ్రెస్ పార్టీ తీరు ఇంతే’ అని సీఎం విమర్శించారు.‘కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అభివృద్ధి కోసం ఏంచేసింది. కాంగ్రెస్‌ హయాంలో ప్రాజెక్టులు కట్టిండ్రా..? నీళ్లు ఇచ్చిండ్రా..? ఉద్యోగాలు ఇచ్చిండ్రా..? కరెంటు ఇచ్చిండ్రా..? అందుకే గుడ్డిగా ఓటేయొద్దని నేను కోరుతున్నా. ఆలోచించి ప్రజల బాగుకోరే పార్టీ ఓటేస్తే వచ్చే ఐదేళ్లు మేలు జరుగుతది’ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.