సైబర్ దాడులతో ఆస్ట్రేలియా ఉక్కిరిబిక్కిరి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సైబర్ కేటుగాళ్ల దెబ్బకు ఆస్ట్రేలియా షేక్ అవుతోంది. వరుసగా జరుగుతోన్న సైబర్ దాడులు ఆ దేశాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద నౌకాశ్రయం వెబ్‌సైట్ సైబర్‌ దాడికి గురైంది. దీంతో దాని వెబ్‌సైట్లు కొన్ని రోజులపాటు మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ దాడులను స్వయంగా ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆధికారులు ధ్రువీకరించారు. ఆస్ట్రేలియా ఎగుమతులు, దిగుమతుల్లో 40 శాతం సముద్ర రవాణా దుబాయ్‌కు చెందిన డీపీ వరల్డ్‌ అనుబంధ సంస్థ నిర్వహిస్తోంది. డీపీ వరల్డ్ ఆస్ట్రేలియా ప్రధాన పోర్టుల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తోంది.మెల్‌బోర్న్‌, సిడ్నీ, బ్రిస్బేన్‌, పెర్త్‌, ఫ్రిమాంటల్ వంటి ప్రధాన పోర్టుల టెర్మినళ్లు దీని అధీనంలో ఉన్నాయి. కాగా, డీపీ వరల్డ్‌ ఆస్ట్రేలియా సైబర్‌ దాడి అంశం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సైబర్ దాడితో ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడినట్టు తెలుస్తోంది. దీని కారణంగా భారీ నౌకల నుంచి సరుకు అన్‌లోడ్ చేయకపోవడంతో పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తమ సిబ్బంది, కస్టమర్లు, నెట్‌వర్క్‌ల వ్యవస్థను సంరక్షించడానికి చర్యలు తీసుకున్నట్టు సదరు సంస్థ వెల్లడించింది.ముఖ్యంగా కీలక నెట్‌వర్క్‌ల నుంచి ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని నిలిపివేశామని, ఫలితంగా చాలా వ్యవస్థలు సాధారణ స్థాయిలో పనిచేయలేదని చెప్పింది. కాగా, సోమవారం నుంచి డీపీ వరల్డ్‌ సంస్థ అన్ని వెబ్‌సైట్లు ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాగా, సైబర్ దాడిపై డీపీ వరల్డ్ ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ కో-ఆర్డినేటర్‌ డారెన్‌ గోల్డీ స్పందించారు. సైబర్ దాడి నుంచి ఆ సంస్థ వేగంగా కోలుకుంటోందని, వెబ్‌సైట్లను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ పరిస్థితి కొన్ని రోజులు మాత్రమే ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఈ దాడికి పాల్పడినవారిని ఇంకా గుర్తించలేదని అన్నారు.అటు, డీపీ వరల్డ్ సైతం తమ పోర్టుల్లో శుక్రవారం ఇంటర్నెట్‌ వినియోగాన్ని పూర్తిగా నిలిపేశామని ప్రకటించింది. అక్రమ కార్యకలాపాలను నిరోధించడానికే ఇలా చేసినట్లు తెలిపింది. తత్ఫలితంగా ట్రాన్స్‌పోర్టు ట్రక్కులు కంటెయినర్లను తరలించలేకపోతున్నాయని ఆ సంస్థ డైరెక్టర్‌ బ్లేక్‌ టియర్నీ వెల్లడించారు. ‘కీలక వ్యవస్థల విజయవంతమైన పరీక్షల తర్వాత రాత్రికి ఓడరేవుల పునఃప్రారంభమవుతాయని డీపీ వరల్డ్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు టెర్మినల్స్ నుంచి సుమారు 5,000 కంటైనర్లు బయటకు వెళ్తాయని పేర్కొంది.ఈ పరిస్థితిపై సోమవారం ఉదయం పోర్ట్స్‌ ఆస్ట్రేలియా ఓ ప్రకటన చేసింది. ‘డీపీ వరల్డ్‌ టెర్మినళ్లలో పరిస్థితి అలాగే కొనసాగుతోంది.. మిగతా సంస్థల ఆధీనంలోని ఓడరేవుల టెర్మినళ్లు సాధారణంగానే పనిచేస్తున్నాయి’ అని పేర్కొంది. సైబర్ దాడి విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వంతో కలిసి డీపీ వరల్డ్‌ పనిచేస్తోందని తెలిపింది. ఆస్ట్రేలియా ఫైనాన్షియల్ రివ్యూ ప్రకారం.. మొత్తం 30,000 షిప్పింగ్ కంటైనర్‌లు నౌకలు నుంచి ఆన్‌లోడ్ కోసం ఎదురుచూస్తున్నాయి.కాగా, ఆస్ట్రేలియాలోని రెండో అతిపెద్ద టెలి కమ్యూకేషన్స్‌ సంస్థ ఆప్టస్‌లో ఇటీవల సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దాదాపు కోటి మంది కస్టమర్లకు ఇంటర్నెట్‌, మొబైల్‌ సేవలు నిలిచిపోయాయి. గతేడాది కూడా ఈ సంస్థకు చెందిన సమాచారం లీకయ్యింది. ఆస్ట్రేలియా చరిత్రలోనే అది అతిపెద్ద డేటా లీక్‌గా నిలిచింది. అప్పట్లో దీనికి సైబర్‌ దాడే కారణమని అనుమానించారు. తాజా ఘటనకు కారణాలు తెలియకరాకపోయినా.. సైబర్ నేరగాళ్ల చర్యగానే భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.