తక్షణమే నీటి విడుదలను ఆపాలి

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: నాగార్జున సాగ‌ర్ రైట్ కెనాల్‌కు త‌క్ష‌ణ‌మే నీటి విడుద‌ల‌ను ఆపేయాల‌ని కృష్ణా రివ‌ర్ బోర్డు మేనేజ్‌మెంట్ ఆదేశాలు జారీ చేసింది. సాగ‌ర్ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు 15 టీఎంసీల నీటి విడుద‌ల‌కు ఒప్పందం కుదిరింది. అక్టోబ‌ర్ 10 నుంచి 20వ తేదీ వ‌ర‌కు ఐదు టీఎంసీలు, జ‌న‌వ‌రి 8 నుంచి 18 వ‌ర‌కు ఐదు టీఎంసీలు, ఏప్రిల్ 8 నుంచి 24వ తేదీ వ‌ర‌కు ఐదు టీఎంసీలు వాడుకునే విధంగా ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి.2014 నుంచి శ్రీశైలం డ్యాం ఏపీ ప్రభుత్వం ఆధీనంలో, నాగార్జునసాగర్‌ తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయని గుర్తుచేసింది. రెండు జలాశయాల్లో నీటి పంపిణీని కేఆర్‌ఎంబీ పర్యవేక్షిస్తున్నదని, రెండు జలాశయాల నిర్వహణ బాధ్యతలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించేందుకు ఇప్పటికే ఇరు రాష్ర్టాలు సూత్రప్రాయంగా అంగీకరించాయని గుర్తుచేసింది. ఇందుకు ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ రూపొందించే దిశగా చర్చలు కొనసాగుతున్నాయని, అప్పటివరకు ప్రాజెక్టుల నిర్వహణపై యథాతథస్థితిని కొనసాగించాల్సి ఉన్నదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం గతంలో కూడా నాగార్జునసాగర్‌ డ్యామ్‌ను సైతం ఆక్రమించడానికి యత్నించిందని గుర్తుచేసింది.తాజాగా తెలంగాణ ఎన్నికల్లో నిమగ్నమై ఉండగా, ఇదే అదునుగా బుధవారం అర్ధరాత్రి 100 మంది సాయుధ పోలీసులను దింపి డ్యామ్‌ను అక్రమించేందుకు యత్నించిందని, 13వ గేట్‌ వద్ద ముళ్ల కంచెను ఏర్పాటు చేసిందని, అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసిందని తెలిపింది. ఇది అప్రజాస్వామికమని పేర్కొన్నది. కుడి కాలువ ద్వారా అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నదని మండిపడింది. దీనిపై కేఆర్‌ఎంబీ వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేసింది. దౌర్జన్యపూరితంగా ఏపీ చేపట్టిన నీటి తరలింపును ఆపాలని, డ్యామ్‌ ఆక్రమణను తొలగించి పూర్వపుస్థితిని పునరుద్ధరించి మొత్తం డ్యామ్‌ కంట్రోల్‌ను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. డ్యాంను కంట్రోల్‌లోకి తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌కు సహకరించడానికి ఈఎన్సీ హరిరాం, చీఫ్‌ ఇంజినీర్‌ ధర్మతోపాటు పలువురు సీనియర్‌ ఇంజినీర్లను డ్యామ్‌ వద్దకు పంపించింది.

Leave A Reply

Your email address will not be published.