41 వేల బ్యాంకు ఖాతాలపై సిబిఐ దర్యాప్తు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్:  యూకో బ్యాంక్‌ కస్టమర్ల బ్యాంకు అకౌంట్లలోకి కోట్లాది రూపాయలు జమ అయిన వ్యవహారంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు ముమ్మరం చేసింది. యూకో బ్యాంక్ కస్టమర్ల ఖాతాలో సుమారు రూ.820 కోట్లు పొరపాటున బదిలీ అయినట్లు తెలిసింది. అయితే సరిగ్గా ఖాతాల్లోకి డబ్బులు వచ్చిన అవే తేదీల్లో కొత్తగా తెరుచుకున్న అకౌంట్లపై ఇప్పుడు సీబీఐ ప్రత్యేక దృష్టి సారించింది. నవంబర్‌ 10 నుంచి 13 వ తేదీల మధ్య యూకో బ్యాంక్‌కు చెందిన 41 వేల మంది కస్టమర్ల అకౌంట్లలోకి పొరపాటున డబ్బులు జమైన విషయం తెలిసిందే. అయితే బదిలీ చేసిన ఇతర బ్యాంకు ఖాతాల్లో ఎలాంటి బ్యాలెన్స్ కట్‌ అవ్వకుండానే యూకో బ్యాంక్‌ ఖాతాదారుల అకౌంట్లలో నగదు జమ అవ్వడం గమనార్హం. దీనిపై బ్యాంక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించింది సీబీఐ.బ్యాంకు అకౌంట్లలో పొరపాటున నగదు జమైన తేదీల్లోనే యూకో బ్యాంకులో వేలాది కొత్త అకౌంట్లు తెరవడంపై సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది. ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల్లోనే ఆయా కొత్త ఖాతాలు ఎలా తెరుచుకున్నాయనే దానిపై సీబీఐ ఆరా తీస్తోంది. పొరపాటున జమ అయిన నగదును చాలా మంది విత్‌ డ్రా చేసుకున్నట్లు గుర్తించింది. ఎలాంటి దురుద్దేశం లేకుండా డబ్బులు విత్‌ డ్రా చేసుకున్న వారు తమ దర్యాప్తు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీబీఐ పేర్కొంది. మోస పూరితంగా, కుట్ర పూరితంగా వ్యవహరించి లబ్ధి పొందిన వారిపైనే తాము దృష్టి సారించామని స్పష్టం చేసింది.ప్రస్తుతం కొందరు మోసగాళ్లు దర్యాప్తు అధికారులమంటూ ఖాతాదారుల్ని మోసగించే అవకాశం ఉందని సీబీఐ హెచ్చరించింది. కేసుకు సంబంధించిన వివరాల కోసం సీబీఐ ఏ ఒక్కరికీ ఫోన్‌ కాల్స్‌ చేయబోదని, ఒకవేళ ఎవరైనా అలా కాల్‌ చేస్తే సీబీఐని సంప్రదించాలని సూచించింది. రాజస్థాన్‌లో అత్యధికంగా 230 శాఖల పరిధిలో 28 వేల అకౌంట్లకు 7.50 లక్షల ట్రాన్సాక్షన్లు జరిగినట్లు సీబీఐ గుర్తించింది. మొత్తం రూ.760 కోట్లు జమ అయ్యింది. అలాగే, కర్ణాటకలో రూ.3.40 కోట్లు, పశ్చిమ బెంగాల్‌ రూ.2.60 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు సీబీఐ గుర్తించింది. ఈ అనుమానాస్పద లావాదేవీలపై యూకో బ్యాంక్‌ ఇద్దరు సపోర్ట్‌ ఇంజినీర్లు, గుర్తు తెలియని వ్యక్తులపై ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఇటీవల వివిధ చోట్ల జరిపిన సోదాల్లో మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డు వంటి ఎలక్ట్రానిక్‌ ఆధారాలను సీబీఐ సేకరించింది.

Leave A Reply

Your email address will not be published.